ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టే.. ఒకసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఎస్‌ఈసీ చెప్పిందే ఫైనల్.. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించకూడదు. ఇప్పటికే నడుస్తున్న పథకాలను కూడా కొన్ని రోజులు అమలు చేయకూడదు. ఇది ఎన్నికల నిబంధన. ఇప్పటికే మొన్న పత్రికల్లో ఏకగ్రీవాలపై ప్రభుత్వం ప్రకటన ఇచ్చినందుకు ఎస్‌ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఐ అండ్ పీఆర్‌ శాఖకు ఎస్‌ఈసీ నోటీసులు పంపించారు.  

ఎస్‌ఈసీ కోడ్ పై ఇంత పట్టుదలగా ఉంటే మరోసారి జగన్ తన హద్దు దాటినట్టే కనిపించారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై నిన్న  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల స్థలాల పంపిణీ, గృహ నిర్మాణంపై సంబంధిత మంత్రి ఉన్నతాధికారులతో సీఎం చర్చించి పలు కీలక ఆదేశాలిచ్చారు.  దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి 12 రోజుల్లో వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 30,06,673 ఇళ్లపట్టాలకు గానూ 26,21,049 పట్టల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మార్చి 31 నాటికి వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక పూర్తి చేస్తామన్నారు. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్‌వాడీ కేంద్రాలు, వైయస్‌ఆర్‌ క్లీనిక్‌లు,  పీహెచ్‌సీలు, పాఠశాలలు, బస్టాప్‌లు వంటి నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అయితే మరి ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం కోడ్ కిందకు రాదా అన్న అనుమానం ప్రభుత్వ వర్గాల్లోనూ ఉంది.అందుకే జగన్ ఏమన్నారంటే.. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అన్నారు. కానీ ఎస్‌ఈసీ మాత్రం ఎలాంటి లబ్ది చేకూర్చే పథకాలు అమలు చేయకూడదు అంటున్నారు. మరి దీనిపై ఎస్‌ఈసీ ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: