ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేయడం మానలేదు వైసీపీ నేతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. నిమ్మగడ్డను టార్గెట్ చేస్తే.. ఇప్పుడు ఎలాంటి పదవుల్లో లేని సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్ఈసీపై తీవ్రపదజాలంతో మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల.. నిమ్మగడ్డ వ్యవహార శైలి ఫ్యాక్షనిస్ట్ తరహాలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, నిమ్మగడ్డ ఇద్దరూ కలసి పంచాయతీల్లో ఏకగ్రీవాలను అడ్డుకుంటున్నారని అన్నారు సజ్జల. అంతేకాదు.. కుట్రలు, కుయుక్తుల్లో నిమ్మగడ్డ, చంద్రబాబుది ఒకటే డీఎన్‌ఏ అని అన్నారు. నిమ్మగడ్డ పదవి ముగిసేలోగా రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చడమే వారిద్దరి ఎత్తుగడ అని ఆరోపించారు. ప్రభుత్వ సిబ్బందిని భయపెట్టడం, ఎన్నికల విధులు నిర్వర్తించకుండా చేయడం, చంద్రబాబుకు మేలు చేయడమే నిమ్మగడ్డ లక్ష్యం అని సజ్జల అన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ సూత్రధారిగా మారారని చెప్పారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన నిమ్మగడ్డ, వ్యవహార శైలి ఫ్యాక్షనిస్టు ధోరణిని తలపిస్తోందని పేర్కొన్నారు.

అధికారుల్ని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారని అంటున్న సజ్జల.. నిమ్మగడ్డపై చేసిన ఆరోపణలు బెదిరింపుల కిందకి రావా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. హైకోర్టు ఎన్నికలకు అనుమతి ఇచ్చినా.. ఎన్నికల కమిషనర్ కి ప్రభుత్వం కానీ, ఉన్నతాధికారులు కానీ సహకరించలేదు. తీరా సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక, ఎన్నికలకు మేం సిద్ధమేనంటూ సెలవిచ్చారు. ఉద్యోగులు కూడా మా పూర్తి సహాయ సహకారాలందిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై నిమ్మగడ్డ కూడా సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తోంది. అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలకు సిఫార్సు చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా.. ఈ ఎన్నికలు అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య కాకుండా.. అధికార పక్షం-ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతున్నట్టు అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: