జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇత‌ర పార్టీల గుర్తుపై గెలిచిన వాళ్ల‌ను ఎప్ప‌ట‌కీ త‌మ పార్టీలో చేర్చుకోన‌ని చెపుతూ వ‌స్తున్నారు. పార్టీ ఫిరాయింపుల‌ను తాను ఎంత మాత్రం ఎంక‌రేజ్ చేయ‌న‌నే జ‌గ‌న్ ముందు నుంచి చెపుతున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న్ను నూటికి నూరు శాతం మెచ్చుకోవాలి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇష్ట‌మొచ్చిన‌ట్టుగా ఫిరాయింపులు ప్రోత్స‌హించారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఎంపీల‌తో పాటు ప‌లువురు నేత‌ల‌ను పార్టీలో చేర్చుకున్నారు. చివ‌ర‌కు వారు పార్టీలో చేరాకే పాత‌, కొత్త నేత‌ల మ‌ధ్య గ్రూపు రాజ‌కీయాలు పెరిగిపోయి.. ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయి చివ‌ర‌కు అదే 23 ఎమ్మెల్యే... 3 ఎంపీ సీట్ల‌తో స‌రి పెట్టు కోవాల్సి వ‌చ్చింది.

ఇక ఇప్పుడు జ‌గ‌న్ కూడా ప‌రోక్షంగా పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూనే వ‌స్తున్నారు. ఏకంగా 151 సీట్ల బంప‌ర్ మెజార్టీతో పాటు ఇటు 22 మంది ఎంపీల‌ను ఆంధ్రా ప్ర‌జ‌లు గెలిపించి ఏక‌ప‌క్ష తీర్పు ఇచ్చినా జ‌న‌సేన‌, టీడీపీ ఎమ్మెల్యేల అవ‌స‌రం పార్టీకి లేక‌పోయినా వారిని త‌మ పార్టీ సానుభూతి ప‌రులుగా చేసుకుంటున్నారు. పార్టీ మారిన నేత‌ల‌కు జ‌గ‌న్ కండువాలు క‌ప్పుకోక‌పోయినా ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో వారిని ప‌రోక్షంగా ఎంక‌రేజ్ చేస్తూ ..వీళ్లే పార్టీ నేత‌లు అన్న సంకేతాలు ఇవ్వ‌నే ఇస్తున్నారు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్య‌మేల‌డంతో పాటు నాడు టీడీపీ ప‌రిస్థితి ఫిరాయింపుల‌తో ఎంత దిగ‌జారిందో ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి వైసీపీలో ఉంది.

ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి క‌ర‌ణం బ‌ల‌రాం చేతిలో ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో గెలిచిన క‌ర‌ణం... టీడీపీకి అటు త‌న వార‌సుడు క‌ర‌ణం వెంక‌టేష్‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయ్యి వైసీపీలోకి జంప్ చేసేశారు. దీనికి తోడు ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీ ఓట‌మికి కంక‌ణం క‌ట్టుకుని ప‌ని చేసిన పోతుల సునీత‌, పాలేటి రామారావు లాంటి నేత‌ల‌ను కూడా జ‌గ‌న్ వైసీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వీరంతా వైసీపీలోకి వ‌చ్చి గ్రూపు రాజ‌కీయాల‌తో రాజ్య‌మేలుతూ పార్టీని బ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో అనేక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆమంచి అక్కడ ఓడినా ఆయ‌న స్ట్రాంగ్ నేతే. అంత‌కు ముందు వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన ఆయ‌న సామాజిక బ‌లం లేక‌పోయినా వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాతో 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డిన వారికి అన్యాయం చేస్తూ కొత్త నేత‌లు అక్క‌డ రాజ‌కీయం చేస్తున్నారు. పార్టీని నిల‌బెట్ట‌డంతో పాటు ప్ర‌జ‌ల్లో సొంత బ‌లం ఉన్న వాళ్ల‌ను గుర్తించ‌ని ప‌రిస్థితి.

మ‌రో వైపు పార్టీ మారిన నేత‌ల‌కే ఎంత మాత్రం పొస‌గ‌డం లేదు. దీంతో ఈ జంపింగ్‌ నేత‌ల‌ను పార్టీ అధిష్టానంతో స‌న్నిహితంగా ఉండే ఒక‌రిద్ద‌రు నేత‌లు ఎంక‌రేజ్ చేయ‌డంతో చీరాల వైసీపీ రాజ‌కీయం కిచిడీ అయిపోయింది. ఈ ప్ర‌భావం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తీవ్రంగా ప‌డే సూచ‌న‌లు ఉన్నాయి. పార్టీని న‌మ్ముకున్న వాళ్ల‌కు అన్యాయం జ‌రిగితే ఆ ప్ర‌భావం ఫ‌లితాల‌పై ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని స‌గ‌టు వైసీపీ వీరాభిమాని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తోన్న ప‌రిస్థితి అక్క‌డ ఉంది. మ‌రి జ‌గ‌న్ అక్క‌డ నిజ‌మైన వైసీపీ నాయ‌కుల‌ను గుర్తించి.. డ‌మ్మీల‌ను సైడ్ చేస్తే త‌ప్పా పార్టీ బ‌తికి బ‌ట్ట క‌ట్టే ప‌రిస్థితి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: