పంచాయతీ ఎన్నికల పోరు తీవ్రంగానే ఉంది. ఇప్పటిదాకా పదవులు లేక ఉన్న వారు అంతా ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా సర్పంచ్ పదవుల కోసం పోరాటం ఒక రేంజిలో ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు రెండూ కూడా రంగంలోకి దిగిపోయాయి. కసిగా ఉన్న విపక్ష టీడీపీ దూకుడు చూపుతోంది.

ఎన్నికలు పెట్టండి మా సత్తా చూపిస్తామంటూ నిన్నటి దాకా సవాల్ చేసిన టీడీపీ నేతలు ఇపుడు తగిన జవాబు చెప్పే పనిలో ఉన్నారు. ఎక్కడికక్కడ ముందుగానే అభ్యర్ధులను  టీడీపీ రెడీ చేసి పెట్టుకుంది. అదే విధంగా మిగిలిన నాయకులు కూడా కార్యరంగంలోకి దూకుతున్నారు. 2019 ఎన్నికల నాటి పొరపాట్లు తడబాట్లూ ఈసారి రానీయకుండా చూసుకుంటున్నారు. పంచాయతీ పోరులో కచ్చితంగా విజయం సాధించి తీరాలన్న పట్టుదల పసుపు పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

అదే సమయంలో వైసీపీ నేతలు కూడా రంగంలోకి దిగిపోయారు. ఇక వైసీపీలో అతి పెద్ద సమస్య వర్గ పోరుగా ఉంది ఆశావహులు చాలా మంది ఉన్నారు. దాంతో వారిని బుజ్జగించడం కష్టసాధ్యమే అంటున్నారు. ఒకే పార్టీ నుంచి మూడు నాలుగు నామినేషన్లు పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.ఈ పరిణామం ఫ్యాన్ పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఎన్నికలు ఎపుడు జరిగినా 2019 నాటి భారీ విజయాన్ని నమోదు చేసి తీరుతామని చెప్పిన అధికార పార్టీ నాయకులకు ఇపుడు క్యాడర్ చుక్కలు చూపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తూంటే వైసీపీకి వార్ వన్ సైడ్ కాదు అనిపిస్తోంది. మరి దీని మీద వైసీపీ ఎంత వరకూ సర్దుబాట్లు చేసుకుని ముందుకు సాగుతుందో చూడాలి. ఏది ఏమైనా 2019లో కనిపించిన ఊపూ ఉత్సాహం మాత్రం ఈసారి అధికార పార్టీలో లేదన్నది ఒక చర్చగా ఉంది. ఇక విపక్షంలో ఉన్న టీడీపీ ఈ అవకాశాలను, అధికార పార్టీలో లుకలుకలను ఉపయోగించుకుంటే మాత్రం సీన్ సితారే అవుతుంది అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: