న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్యకేసులో కీలక ఆధారాలు రాబట్టారు పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారినుంచి సమాచారం సేకరించారు. ఆమేరకు అసలు వివాదం ఓ ట్రాక్టర్ నుంచి మొదలైనట్టు తెలుస్తోంది. బిట్టు శ్రీను కి చెందిన ట్రాక్టర్ వద్ద రగిలిన వివాదం పెరిగి పెద్దదై, అనేక మలుపులు తిరిగి చివరకు జంట హత్యలకు కారణంగా మారిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

బిట్టు శ్రీను అలియాస్ తులసిగరి శ్రీనివాస్ కి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. పోలీసులు ట్రాక్టర్ వివాదాన్ని బయటపెట్టారు. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా 2016నుంచి బిట్టు శ్రీను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ట్రస్ట్ గురించి వామన్ రావు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, చులకన చేస్తూ వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు ఉంచేవారనేది  బిట్టు శ్రీను ఆరోపణ. ట్రస్ట్ ఆదాయాలపై కూడా కోర్టులో పిటిషన్లు వేయించారని చెబుతున్నారు. ఇక 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు మంథని గ్రామపంచాయతీలో  బిట్టు శ్రీను చెత్త రవాణా కోసం ఒక ట్రాక్టర్ ను కాంట్రాక్ట్ పద్ధతిలో తిప్పేవాడు. పంచాయతీ నుంచి నెలకు రూ.30వేలు ఆదాయం వచ్చేది. అయితే ఈ ట్రాక్టర్ విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని, వామన్ రావు పంచాయతీలో ఫిర్యాదు చేసి ట్రాక్టర్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయించారట. దీన్ని మనసులో పెట్టుకుని బిట్టు శ్రీను, వామన్ రావుతో గొడవపడేవారని, చివరకి అది హత్యల వరకు వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు.

బిట్టు శ్రీను స్నేహితుడైన కుంట శ్రీనుతో కూడా వామన్ రావు గొడవలు పెట్టుకున్నారని, అందుకే కుంట శ్రీను కూడా ఈ హత్యోదంతంలో పాల్గొన్నాడని తెలుస్తోంది. కుంట శ్రీనుపై హైదరాబాద్ లో వామన్ రావు ఓసారి కేసు పెట్టించాడట. ఆ తర్వాత పెద్దమ్మ తల్లి గుడి నిర్మించే విషయంలో కుంట శ్రీనుకి వామన్ రావు అడ్డు తగిలేవారని, అక్కడినుంచి వారిద్దరి మధ్య వైరం కూడా పెరిగి పెద్దదైందని చెబుతున్నారు. ఈ కారణాలతో వామన్ రావుని అంతమొందిస్తే తమకు అడ్డు ఉండదని అనుకున్న నిందితులు.. కారులో వెళ్తున్న దంపతుల్ని వెంబడించి దారుణంగా హత్య చేశారని తెలుస్తోంది.

జంట హత్యల కేసుతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్న ఎవరినైనా, ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని అంటున్నారు పోలీసులు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: