కరోనా మళ్లీ ముంచుకొస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆదమరిచి ఉంటే ముంచెత్తడానికి సిద్ధమైంది. దేశంలో పెరుగుతున్న కేసులు కలకలం రేపుతున్నాయ్‌. కొత్త స్ట్రెయిన్‌ కారణంగానే కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు.

వ్యాక్సిన్‌ కూడా వచ్చేసింది.. కరోనా పని అయిపోయిందని.. రిలాక్స్‌ కావొద్దు..! ఎందుకంటే కొత్త రూపంలో మహమ్మారి మరింత వేగంగా దూసుకొస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బీకేర్‌ఫుల్‌ అని హెచ్చరించింది. అటు ఐదు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళ నుంచి వచ్చే వాళ్లపై తమిళనాడు సర్కార్‌ నిఘా ఉంచింది. ఇక కర్ణాటక బోర్డర్‌లోనే చెకింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు.

నవంబర్‌ తర్వాత దేశంలో ఇంత భారీగా యాక్టివ్‌ కేసులు రావడం ఇదే మొదటి సారి. ఫిబ్రవరి 16న దేశంలో మొత్తం 9 వేల 121 కరోనా కేసులు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 14 వేలు దాటింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, చత్తీస్‌గడ్‌, మధ్య ప్రదేశ్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. రోజు నమోదు అవుతున్న మొత్తం కేసుల్లో 74 శాతం కేరళ, మహారాష్ట్ర నుంచే ఉన్నాయి.

ఇప్పటికే మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు విధించారు సీఎం ఉద్దవ్‌ ఠాక్రే. పార్టీలు, సమావేశాలపై నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మహారాష్ట్రలో కొత్తగా 6వేల 971 కేసులు వచ్చాయి. ఆ తర్వాత అత్యధిక కేసులు కేరళ నుంచి వస్తున్నాయి. ఇక్కడ కొత్తగా 4వేల 70 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లోనూ ఇలాగే కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇదే ఆందోళనకు గురి చేస్తోంది.

కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చెబుతున్నారు డాక్టర్లు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మరో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే దేశంలో పెరుగుతున్న కేసులకు కొత్త స్ట్రెయిన్‌ కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. దాని వల్లే ఇది వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోసారి ముఖానికి మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని తేల్చి చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: