చాల మంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. మనిషి కన్నా ఎక్కువ విశ్వాసంగా కుక్క ఉంటుంది. అందుకేనేమో టెంపర్ సినిమాలో పూరి కుక్కల గురించి అంత బాగా చెప్పారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే పూరీ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తున్నాయి. అయితే పూరి ఏం చెప్పారు అనుకుంటున్నారా.. మనుషుల్లో మానవత్వం అడుగంటిపోతున్న ఈరోజుల్లో కావాల్సింది కుక్కతత్వమేనేమో అనిపిస్తుంది.

ఇక విశ్వాసం లేని కుక్క’ అని ఎవరైనా నమ్మక ద్రోహం చేసినప్పుడు ఆవేశంలో అంటుంటారు గానీ శునకానికి ఎంత విశ్వాసం ఉంటుందో చెప్పడానికి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోనే నిదర్శనం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 1989 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి శుశాంత నంద తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది.



ఈ వీడియోలో ఓ చిన్నారి ఓ కాలువ పక్కన ఆడుకుంటూ ఉండగా ఆట వస్తువు ఒకటి నీళ్లలో పడింది. పెద్దలెవరూ ఆ చిన్నారిని గమనించలేదు. ఆ చిన్న పాప అమాయకంగా తన ఆట వస్తువును తెచ్చుకునేందుకు నీటిలో దిగబోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ శునకం నీళ్లలో దిగుతున్న ఆ పాపను చొక్కా నోట కరుచుకుని బయటకు లాక్కొని వచ్చింది. ఆ తర్వాత పాప ఒడ్డున ఉండగా నీళ్లలో దిగి ఆ ఆట వస్తువును శునకం బయటకు తెచ్చి పాపకు ఇచ్చింది.

అయితే మనుషులంటే కుక్కలకు ఎంత ఇష్టమో, అవి నమ్మితే ఎంత స్నేహంగా ఉంటాయో.. ఎంతటి ప్రమాదం నుంచి గట్టెక్కిస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆ కుక్క ఒడ్డునే నిల్చుని నీళ్లలో దిగుతున్న ఆ చిన్నారిని చూస్తూ ఉండి ఉంటే ఏం జరుగుతుందో ఊహించలేం. ఆ వీడియో చూసిన నెటిజన్లు మనుషుల్లో ఆ కుక్క లాంటి వాళ్లు నూటికోకోటికో ఒక్కరున్నారని కామెంట్ చేస్తున్నారు. అలాంటి స్నేహం దొరకడం అదృష్టమంటున్నారు. శుశాంత నంద పోస్ట్ చేసిన ఈ వీడియోపై లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: