విశాఖలో రెండు పార్టీలు మేయర్ పీఠాన్ని ఇప్పటికే అధిరోహించిన అనుభవాన్ని సాధించాయి. మరో పార్టీకి చూస్తే విశాఖలో ఆదరణ పెరుగుతోంది. ఇక అధికార వైసీపీకి చూస్తే విశాఖలో తనకు పెద్ద సవాలే ఎదురవుతోంది. అనేక ఆటంకాల మధ్య వైసీపీ మేయర్ పోరులోకి దూకుతోంది.

విశాఖ తొలి మేయర్ గా బీజేపీకి చెందిన స్వర్గీయ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి 1981లో జరిగిన ఎన్నికల్లో ఘన  విజయం సాధించారు. ఆయన గెలుపు కోసం అప్పట్లో దివంగత నేత వాజ్ పేయ్ చాలా రోజులు విశాఖలో మకాం చేసి మరీ విజయం తెచ్చి పెట్టారు.  ఇక అప్పట్లో వెంకయ్యనాయుడు కూడా విశాఖలో బీజేపీని బలోపేతం చేసేందుకు చాలానే శ్రమించారు. అలా నాడు వారు వేసిన పునాదులు ఆ పార్టీకి ఇప్పటికీ రక్షణగా ఉన్నాయి. ఎవరితో పొత్తులు లేకపోయినా కొన్ని వార్డుల్లో తమ ఖాతాను తెరిచే సత్తా బీజేపీ సొంతం.

ఇక మరో వైపు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న జనసేన బీజేపీతో జట్టు కట్టింది. దాంతో పాటు విశాఖలో పెద్ద సంఖ్యలో కాపులు ఉన్నారు. ఇలా రాజకీయంగా సామాజికవర్గం పరంగా కూడా ఈ కూటమి బాగానే జోరు చూపించగలదు అని లెక్కలు వేస్తున్నారు. మరో వైపు చూసుకుంటే టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ముప్పై వార్డులకు తక్కువ కాకుండా గెలుపు ఖాయమని లెక్కలు ఉన్నాయి. టీడీపీ కూడా ఒకసారి 1987లో మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుంది.

జీవీఎంసీకి  చివరిసారిగా జరిగిన 2007 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 35 దాకా సీట్లు తెచ్చుకుంది. అదే విధంగా బీజేపీకి ఏడు దాకా సీట్లు వచ్చాయి. తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే జనసేనకు నాలుగు నుంచి ఆరేడు సీట్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు. అంటే ఈ మూడు పార్టీలు కనుక ఎన్నికల ముందు లోపాయికారి అవగాహనతో పనిచేసినా లేక ఎన్నికల తరువాత కలిసినా కూడా జీవీఎంసీ పీఠం అధికార వైసీపీకి దక్కకుండా చేయగలరు అన్న రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ముప్పేట దాడిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: