విశాఖ మునిసిపాలిటీ నగర పాలక సంస్థగా 1979లో ఎదిగింది. ఆ తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠం పట్టేసింది. నాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలు బలంగా ఉన్నాయి. ఆ ప్రభావం విశాఖలో కూడా ఉంది. విశాఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక పరిశ్రమలు ఉన్నాయి. అలాగే కర్మాగారాలు పెద్దవి కూడా ఎన్నో ఉన్నాయి. ఒక విధంగా పారిశ్రామిక నగరంగా విశాఖను చెప్పుకుంటారు.

దాంతో విశాఖలో వామపక్షాలకు గట్టి పట్టు ఉంది. విశాఖలో పలుమార్లు ఎమ్మెల్యే సీట్లను కూడా కామ్రెడ్స్ గెలుచుకున్నారు. ఇక పారిశ్రామిక వాడలో కార్పోరేటర్లను కూడా వామపక్షాలు పెద్ద ఎత్తున గెలుచుకుంటూ వస్తున్నాయి. విశాఖ కార్పొరేషన్ 2005లో మహా నగర పాలక సంస్థగా అవతరించింది. నాటికి బీజేపీతో పొత్తు చిత్తు అయిన టీడీపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది. ఆ విధంగా రెండు పార్టీలు బాగానే సీట్లు సంపాదించాయి. ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళకు ముందు చివరిసారిగా జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. వామపక్షాలు 2014 తరువాత నుంచి ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చాయి. 2019 ఎన్నికల్లో మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి. అయితే బలం వారికి తగ్గింది.

కానీ ఈ మధ్య కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న అనేక విధానాల మూలంగా విశాఖలో మళ్ళీ ఆందోళనల బాట పట్టిన కామ్రేడ్స్ తమ పట్టుకుని పెంచుకోవడానికి చూస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడానికి కేంద్రం సిధ్ధం కావడం, ప్రధాన పార్టీలేవీ పెద్దగా స్పందించకపోవడం వంటి పరిణామాలు కామ్రెడ్స్ కి ఉపయోగపడుతాయని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ లో కార్మిక సంఘాలు కూడా వామపక్షాలవే కావడంతో ఈసారి అక్కడ జరిగే కార్పోరేటర్ ఎన్నికల్లో తమ సత్తా గట్టిగానే చాటుతాయని అంటున్నారు. అదే కనుక జరిగితే జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటు మీద ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీలకు గట్టి షాక్ తగులుతుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: