వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డికి ట్విట్ట‌ర్ రెడ్డి అని పేరు ప‌డింది. సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల నుంచే కాకుండా ఇత‌ర పార్టీల నేత‌లు కూడా సాయిరెడ్డిని ట్విట్ట‌ర్ రెడ్డి అంటూ విమ‌ర్శిస్తున్నారు. ఏ సంఘ‌ట‌న జ‌రిగినా ఆ సంద‌ర్భానికి అనుగుణంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లను సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా గుప్పిస్తున్నారు. దీనికోసం ఆయ‌న కొన్నిసార్లు ప‌రుష ప‌దుజాలం కూడా ఉప‌యోగిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై త‌న విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు.

తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిని ప్ర‌జ‌లు చ‌క్కగా చూపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెల‌వ‌డం కోసం రౌడీయిజం, ప్రలోభాలకు తెగబడుతున్నారు.   విజయనగరంలో బహిరంగంగానే కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా? చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా?" అని సాయిరెడ్డి ప్రశ్నించారు.ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు మొద‌టినుంచి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తూ ప‌దునైన ప‌ద‌జాలంతో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

అంతకుముందు మరో ట్వీట్ పెట్టిన సాయిరెడ్డి "ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగా రాకపోతే ఎవ‌రైనా ఓటమిని సమీక్షించుకుంటామంటారు. నాలుగో విడత 41.7% ఓట్లు పడ్డాయని సొల్లు మాటలు చెపుతూ  ప్రభుత్వంపై చంద్ర‌బాబునాయుడు దుమ్మెత్తి పోశార‌న్నారు. ఈయ‌న మార‌ర‌ని, ఆయ‌న త‌న భ్ర‌మ‌ల్లో జీవిస్తూ అంద‌రినీ  అదే భ్రాంతిలో ఉంచాలని చూస్తాడు" అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీగా, ఆడిట‌ర్‌గా, వ్యాపార‌వేత్త‌గా ప‌లురంగాల్లో ఉన్న విజ‌య‌సాయిరెడ్డికి ఎప్పుడు ఎవ‌రితో ఎలా మాట్లాడాలో తెలియ‌నిదేంకాదు. కానీ రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న‌వారిని కూడా వ‌ద‌ల‌కుండా ప‌రుష‌ప‌ద‌జాలం ఉప‌యోగిస్తూ ఎదుటివారి నుంచి విమ‌ర్శ‌ల‌ను కొనితెచ్చుకోవ‌డం సాయిరెడ్డికే తెలుసంటూ సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: