వారి పేరే రెబెల్స్. అభ్యర్ధుల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగించేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆశావహులు పెద్ద ఎత్తున   నామినేషన్లు వేశారు. అభ్యర్ధులను కూడా ఉన్నఫళంగా సెలెక్ట్ చేశారు. దీంతో కొందరికి అన్యాయం జరిగింది. ఈ నేపధ్యంలో కడుపు మండిన వారు రెబెల్స్ అయ్యారు. వారు కూడా అధికారిక అభ్యర్ధులకు ధీటుగా ఇపుడు ప్రచారం చేస్తూండడంతో అసలైన వారి గుండెల్లో కలవరం రేగుతోంది.

విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో రెబెల్స్ బెడత అన్ని పార్టీలకు ఉంది. అయితే అధికార వైసీపీకి ఈ బాధ ఇంకా ఎక్కువగా ఉంది. ఆ పార్టీ తరఫున ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో నాడు అందరికీ కూర్చోబెట్టి నచ్చచెప్పలేకపోయారు. ఇక ఏడాది అయినా కూడా వారిని దారికి తెచ్చే పనిని పార్టీ పెద్దలు ఎవరూ చేపట్టలేదు. సడెన్ గా మునిసిపల్ ఎన్నికలు వచ్చేశాయి. దాంతో రెబెల్స్ తాము ఎవరికీ తీసిపోము అంటూ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు.

ఈ పరిణామంతో మేయర్ పీఠం మీద ఆశలు పెట్టుకున్న వైసీపీకి ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది అంటున్నారు. విశాఖ సౌత్ లో ఇపుడు రెబెల్స్ చాలా జోరు చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ కి మద్దతుదారులుగా ఉన్న కొందరు రెబెల్స్ అవతారం ఎత్తడంతో అక్కడంతా మొత్తం గందరగోళంగా సీన్ తాయారైంది. విశాఖ సౌత్ లో 13 వార్డులు ఉన్నాయి. ఇక్కడ విజయావకాశాలు ఎమ్మెల్యే రాకతో అధికం అవుతాయని భావిస్తూంటే రెబెల్స్ రంగంలోకి దిగిపోవడంతో ఇపుడు వైసీపీకి కొత్త కంగారు మొదలైంది.

నాడు నామినేషన్లు పెద్ద ఎత్తున వేసిన వారంతా ఇపుడు ఎమ్మెల్యేను ఆశ్రయించి తమకే బీ ఫారం ఇవ్వమంటున్నారు. ఎమ్మెల్యే సైతం తన మద్దతుదారులే అధికార అభ్యర్ధులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెబెల్స్ చేత నామినేషన్ల ఉపసంహరణకు వైసీపీ పెద్దలు గట్టిగానే పనిచేయాల్సి ఉంటుంది అంటున్నారు. వారు ససేమిరా అంటే మాత్రం గట్టి షాక్ తప్పదు. ఇదే పరిస్థితి టీడీపీలో కూడా ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు ఇరకాటంలో పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: