పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు కేసులు.. సీబీఐ ఎంట్రీ హాట్‌ టాపిక్‌గా మారింది. బీజేపీ యువ మోర్చా నేత డ్రగ్స్‌ కేసులో దొరకడం.. సంచలనంగా మారింది. ఈ కేసులో మరికొందరు బీజేపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై రగడ సాగుతుండగానే.. మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ భార్యకు సీబీఐ నోటీసులు అందాయి.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఈ రెండు పార్టీలు నువ్వా..? నేనా..? అంటున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం మరింత ముదిరింది. కేసుల పరంపర కొనసాగుతోంది. డ్రగ్స్‌ కేసులో బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైతే.. ఇప్పుడు మమత మేనల్లుడే టార్గెట్‌గా సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో కోల్‌ స్కాం కేసులో అభిషేక్‌ బెనర్జీ భార్య రుజురా బెనర్జీకి సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయి. విచారణలో పాల్గొనాలని సీబీఐ ఆమెను ఆదేశించింది.

బెంగాల్‌లో కోల్‌ మాఫియా.. అభిషేక్‌ బెనర్జీకి భారీ మొత్తంలో లంచాలు కుమ్మరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా అక్రమార్కులు యధేచ్చగా తవ్వుకుపోయి.. దాన్ని ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అభిషేక్‌ బెనర్జీపై బీజేపీ మండిపడుతోంది. టీఎమ్‌సీ నేత వినయ్‌ మిశ్రా ద్వారా అభిషేక్‌ బెనర్జీకి లంచాలు చేరుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే వినయ్‌ మిశ్రా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పమేల గోస్వామి కొకైన్‌ తరలిస్తూ పట్టుబడ్డారు. అయితే ఈ కేసులో బీజేపీ సీనియర్‌ నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ అనుచరుడు రాకేష్‌సింగ్‌ పేరు తెరమీదికి వచ్చింది. అయితే ఇది జరిగిన మర్నాడే సీబీఐ నుంచి అభిషేక్‌ బెనర్జీ భార్యకు నోటీసులు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. గతేడాది నవంబర్‌లో సీబీఐ కేసు నమోదైతే.. తాజాగా నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

నోటీసులు వచ్చిన విషయాన్ని అభిషేక్‌ బెనర్జీ ధృవీకరించారు. చట్టం పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇలాంటి చర్యలతో తమను బెదిరిద్దామని చూస్తే పొరపాటే అన్నారు. మొత్తంగా ఈ రెండు కేసులు ఇప్పుడు బెంగాల్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: