ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశమే 14 నెలలుగా హాట్ టాపిక్. అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణ పనులు కూడా చేపట్టింది గత చంద్రబాబు ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
అమరావతికి జై కొట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో మాట మార్చాడు. మూడు
రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. జగన్ సర్కార్ నిర్ణయంతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. నాలుగు వందల రోజులకు పైగా నిరసనలు చేస్తూనే ఉన్నారు.

విపక్షాలన్ని అమరావతికే మద్దతు తెలిపినా వెనక్కి తగ్గలేదు జగన్. దీంతో అమరావతిలో ప్రారంభమైన నిర్మాణాలన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి.విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతామని పదేపదే ప్రకటించిన జగన్ లో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. మంగళవారం జరిగిన
ఏపీ మంత్రివర్గ సమావేశంలో అమరావతిపై కీలక నిర్ణయం జరిగింది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.ఇందుకోసం అవసరమైన  3వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకునేందుకు...  బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు సీఎం జగన్ అంగీకరించారు. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.

జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. జగనోరిలో  సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా అన్న చర్చ జరుగుతోంది. జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం నమ్మలేకపోతున్నారు.

అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకుందనే చర్చ కూడా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: