"రీజినల్ రింగ్ రోడ్డు" -  ఆర్ఆర్ఎర్ - తెలంగాణ ఎప్పటి నుంచో వింటున్న మాట. హైదరాబాద్ నగరం చుట్టూ ఉండే జిల్లాలను కలిపే మణిహారం లాంటి ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చ బోయే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో,  340 కి.మీ మేర ప్రాంతీయ వలయ రహదారి - రీజినల్ రింగ్ రోడ్డు - ఉండబోతోంది. నేడు (మంగళవారం) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వం లోని బీజేపీ నేతల బృందం కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి ప్రాజెక్ట్ నిర్మాణంపై చర్చించారు. ఈ ప్రాజెక్టు కు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, ఆర్ఆర్ఆర్ తెలంగాణకు మణిహారంలా ఉండబోతుందని కిషన్ రెడ్డి చెప్పారు.

"రీజినల్ రింగ్ రోడ్డు" -  ఆర్.ఆర్.ఆర్ - ప్రత్యేకతలు

*ఆర్ఎర్ఆర్ మొత్తం పొడవు 340 కి.మీ. ఆర్ఆర్ఆర్ ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు.

*ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్ పట్టణాలను కలుపుతుంది. ఈ రహదారి పొడవు 132 కి.మీ.ఉండనుంది.

*ఇక దక్షిణ భాగం చౌటుప్పల్, ఇబ్రహీం పట్నం, కందుకూరు, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్‌ పల్లి, కంది, సంగారెడ్డిలను కలుపుతుంది. దీని పొడవు. 182 కి.మీ.


*ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.17000కోట్లు. ఇందులో రూ. 4వేల కోట్లు భూసేకరణకు ఖర్చుకానుంది. ఐతే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.1,905 కోట్లు భరించాల్సి ఉంటుంది. భూసేకరణ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రభుత్వానిదే. 


*సంగారెడ్డి నుంచి తూప్రాన్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు నిర్మించ బోయే మొదటి దశకు 2017 లోనే జాతీయ రహదారి 161 ఏఏ గా కేంద్రం గుర్తించింది. ఇక చౌటుప్పల్‌ - షాద్‌నగర్‌ మీదుగా కంది వరకు ఉన్న రెండో దశకు జాతీయ రహదారి నెంబర్‌ కేటాయించాల్సి ఉంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాగపూర్‌–హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్, పుణె–హైదరాబాద్‌–విజయవాడ కారిడార్‌లో జాతీయ రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యత పెరుగుతుంది. ముంబై, పుణె, నాగపూర్, బెంగళూరు, ఢిల్లీ  వైపు వెళ్లే వాహనాలకు ఈ మార్గాల ద్వారా దారి మళ్లిస్తారు. 


అప్పుడు హైదరాబాద్‌ చుట్టూ వాహనాల రాకపోకలు తగ్గి, ట్రాఫిక్ సమస్యతో పాటు వాయు కాలుష్యం కూడా తగ్గు తుంది. రాష్ట్రం  భూసేకరణ త్వరిత గతిన చేపడితే కేంద్రం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభిస్తుందని గడ్కరీ చెప్పినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. ఆర్ఆర్ఆర్  ఆ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మూడేళ్ల లోగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.





మరింత సమాచారం తెలుసుకోండి: