శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామివారు కొలువైన పుణ్య‌క్షేత్రం తిరుప‌తి నుంచి పోటీచేయ‌డంతోపాటు విజ‌యం కూడా సాధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాగాకు రంగం సిద్ధం చేసుకుందామ‌నుకున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆశ‌ల‌పై ప్ర‌జ‌లు నీళ్లు చ‌ల్లారు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఘోర‌ప‌రాజ‌యం ఎదురైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ మ‌ధ్యే హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన కొన్ని ప్రాంతాల్లో త‌న ఉనికిని చాటుకుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌ల వ్యూహం ఏమిటంటే ఏ రాష్ట్రంలోనైనా రెండోస్థానంలో ఉన్న పార్టీని క్ర‌మేణా బ‌ల‌హీన‌ప‌రిచి నెమ్మ‌దిగా ఆస్థానాన్ని ఆక్ర‌మించుకోవ‌డం చేయాలి. అనంత‌రం ద్వితీయ స్థానం నుంచి ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న పార్టీని ఢీకొట్టే స్థాయికి చేరుకోవాలి. ఇందుకు త‌గ్గ‌ట్లుగా వ్యూహాలు స‌మ‌కూర్చుకోవాలి. యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలి. భిన్న ప్రాంతాలు, విబిన్న వ్య‌క్తుల మ‌ధ్య ఉండే తేడాల‌ను గ‌మ‌నించి వారి మ‌ధ్య మ‌త‌, కుల విభేదాలు రెచ్చ‌గొట్టాలి. అంతిమంగా చెప్పాలంటే మ‌త‌ప‌రంగా ప్ర‌జ‌ల్ని విడ‌దీయాలి. అనంత‌రం త‌మ‌కు చేరువ చేసుకోవాలి. ఇలా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం అన్ని రాష్ట్రాల్లో వ్యూహాల‌ను అమ‌లుచేస్తూ ప‌య‌నిస్తోన్న భార‌తీయ జ‌న‌తాపార్టీకి ద‌క్షిణాదిలో మాత్రం ప‌ప్పులుడ‌కడంలేదు. ఒక‌ర‌కంగా బీజేపీ పెద్ద‌ల‌కు ద‌క్షిణాది రాష్ట్రాలంటే చిన్న‌చూపు ఉండ‌టానికి కూడా కార‌ణం ఆ పార్టీని ఇక్క‌డెవ‌రూ ఆద‌రించ‌క‌పోవ‌డ‌మే.

పంచాయితీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ప‌రిస్థితి ఏమిటో ప్ర‌జ‌లంత స్ప‌ష్టంగా తేట‌తెల్లం చేసిన త‌ర్వాత చేసేదేమీ లేక తిరుప‌తి ఎంపీ స్థానాన్ని మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌కు వ‌దిలేయాల‌ని పార్టీ పెద్ద‌లు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే తిరుప‌తి ఎంపీ స్థానాన్ని జ‌న‌సేన‌కే ఇవ్వాల‌నే బ‌ల‌మైన సంకేతాల‌ను ఈ పంచాయితీ ఎన్నిక‌లు బీజేపీకిచ్చాయి. ఒక‌వేళ కాద‌ని ఎంపీ స్థానానికి బ‌లవంతంగా పోటీచేసినా జ‌న‌సేన నుంచి ఓట్ల బ‌దిలీ జ‌రిగే అవ‌కాశం క‌న‌ప‌డ‌టంలేదు. జ‌న‌సేన‌కు తిరుప‌తి ఎంపీ సీటు కేటాయించ‌క‌పోతే నోటాకు ఓటువేయాలంటూ స్థానికంగా బ‌లిజ అసోసియేష‌న్ నేత‌లు పిలుపునిచ్చారు. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద‌రావు మృతిచెంది ఐదు నెలలకు పైగా అవ‌డంతో ఏ క్ష‌ణంలోనైనా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: