ఉత్తరాఖండ్‌ జలవిలయం మరిచిపోకముందే మరో ముప్పు పొంచి ఉందా..? తపోవన్‌కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పడ్డ కృతిమ సరస్సు ఇప్పుడు ఆందోళనలను పెంచుతోంది. ఇది ఏ క్షణమైనా బద్ధలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే మరో జలవిలయం తప్పదని చెబుతున్నారు..? దీంతో ఈ సరస్సు లోతు కనుక్కొనేందుకు నేవీ ప్రయత్నం చేసింది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో జల విలయం తర్వాత ఆ శిథిలాలతో ఏర్పడిన సరస్సు ఇది..! ఇక్కడ భారీ మొత్తం నీరు నిల్వ ఉందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. దీంతో దీని లోతును తెలుసుకునేందుకు ఇండియన్‌ నేవీ రంగంలోకి దిగింది. తపోవన్‌కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కృతిమ సరస్సు దగ్గరికి వెళ్లి.. దాని లోతును తెలుసుకునే ప్రయత్నం చేసింది.

హెలికాప్టర్‌లో కృతిమ సరస్సు దగ్గరికి చేరుకున్న నేవీ డైవర్లు.. గడ్డకట్టిన నీళ్లలో లోతు కనుక్కొనేందుకు ప్రయత్నించారు. ఈకో సౌండర్‌ల ద్వారా డేటాను సేకరించారు. ఇందులో ఎంత మొత్తంలో నీరుంది..! ఈ నీటి బరువును అడ్డుగా ఉన్న శిథిలాలు ఆపగలుగుతాయా..? లేదా..? అన్నది తేల్చేందుకు సిద్ధమయ్యారు.

ఈ సరస్సు సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఏర్పడింది. ఇది రిషిగంగా ప్రవాహ మార్గానికి అడ్డుగా మారింది. దీని ముఖ భాగంలో శిథిలాలు ఉండటంతో.. నీరు భారీగా నిల్వ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇది ఏ క్షణమైనా బద్ధలయ్యే అవకాశం ఉందంటున్నారు. అందుకే దీని లోతు ఎంత..? ఏ మేరకు నీరు ఉంది..? అనే అంచనాలు వేస్తున్నారు.

కొండచరియలు విరిగిపడటంతో.. డ్యామ్‌లా ఏర్పడింది. ఇదే రిషిగంగా నదీని బ్లాక్‌ చేస్తోంది. అయితే నీటి ప్రవాహం పెరిగి.. ఇది బద్ధలైతే.. మొన్నటి స్థాయిలో వచ్చినంత ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై శాటిలైట్‌ ఇమేజ్‌లతో పాటు కొందరు శాస్త్రవేత్తలు.. అక్కడి వెళ్లి పరిస్థితి పరిశీలించారు. ముందే అప్రమత్తమైతే.. మరో జలవిలయాన్ని ఆపొచ్చని చెబుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: