ఆంధ్రప్రదేశ్ కు చెందిన బిజెపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ, యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీద ఒక ఛానల్ లైవ్ డిబేట్ లో అమరావతి జేఏసీ నేత ఒకరు చెప్పుతో దాడి చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిజానికి ఏపీ రాజధాని అంశం నిన్న సాయంత్రం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. దానికి కారణం అమరావతి ప్రాంతంలో నిర్మాణాల విషయంలో కీలక ముందడుగు పడడమే. గతంలో ఆగి పోయిన నిర్మాణాలు తిరిగి ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఆ మేరకు నిధుల సమీకరణకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాలు కొనసాగించేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు మూడు వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకు గ్యారంటీని ఎంఆర్డిఎకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 

దీంతో ఈ అంశానికి సంబంధించి తెలుగులో ఒక ప్రముఖ ఛానల్ లైవ్ డిబేట్ నిర్వహించింది. చంద్రబాబు మొదలు పెట్టింది గ్రాఫిక్స్ మాత్రమే అని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 3 వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తోంది అనే యాంగిల్ లో ఈ చర్చ మొదలైంది. ఈ చర్చలో దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. బీజేపీ నుంచి యువనేత, ఏపీ జనరల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే అమరావతి జేఏసీకి సంబంధించి డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు అనే ప్రొఫెసర్ కూడా పాల్గొన్నారు. ఈ చర్చ ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో దారితీసింది. 

కొలికపూడి శ్రీనివాసరావుని టీడీపీ మద్దతుదారుడు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. అంతేకాక మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఆయన సంభోదించడంతో సహనం కోల్పోయిన కొలికపూడి శ్రీనివాసరావు తన చెప్పు తీసుకుని విష్ణువర్ధన్ రెడ్డి మీద దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి కప్పుడు లైవ్ డిబేట్ నిలిపి వేశారు.. అలాగే విష్ణువర్ధన్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన సదరు లైవ్ డిబేట్ నిర్వహణ కర్త ఇకమీదట తన లైవ్ డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు కనిపించరని ఆయనని నిషేధిస్తున్నామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: