ముఖ్యమంత్రులు.. వాళ్ల సొంత ప్రాంతాలకు వరాలు ఇచ్చుకోవడం కొత్త విషయం ఏమీ కాదు.. గతంలో పీవీ నరసింహారావు వంటి మహానుభావులు.. ఏకంగా దేశానికి ప్రధానమంత్రి అయినా.. నా ప్రాంతం, ఇతర ప్రాంతం అంటూ బేధాలు చూపలేదు. కానీ.. ఈ  ఇప్పుడు అంత విశాల హృదయం ఎవరికి ఉంది.. అదీకాక సొంత ప్రాంతానికి చేయకపోతే.. వాడేం నాయకుడు అన్న టాక్ తెచ్చుకోవాల్సి  ఉంటుంది. ఇప్పుడు సీఎం జగన్ కూడా అందుకు అతీతం ఏమీ కాదు కదా.

అందుకేనేమో.. తాజాగా కేబినెట్ సమావేశంలో కడప జిల్లాకు చెందిన పరిశ్రమలకు పచ్చజెండా ఊపేశారు. వైయ‌స్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గ సభ్యులు పచ్చజెండా ఊపారు. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూకేటాయింపులు పూర్తి చేశారు. కడప జిల్లా కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కుకు, అంబాపురంలో 93.99 ఎకరాలతో మరో ఇండస్ట్రియల్ పార్కుకు ఓకే చెప్పేశారు. ఈ రెండు పారిశ్రామిక పార్కులకు ఉచితంగా భూమి కేటాయింపులు జరపాలని నిర్ణయించారు.

ఈ పరిశ్రమలకు సంబంధించి.. ఏపీఐఐసీకి ఉచిత భూ కేటాయింపులపైనా, కడప స్టీల్ ప్లాంట్ కు 3,148 ఎకరాలు కేటాయింపుపైనా నిర్ణయం తీసుకున్నారు. వీటికి ఎకరం రూ.1.65 లక్షల చొప్పున విక్రయించాలని డిసైడ్ చేశారు. ఇప్పటికే జగన్ సీఎం అయ్యాక.. కడప జిల్లాకు నిధుల వరద పారుతోందన్న టాక్ వచ్చింది. పులివెందుల కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇక ఇప్పుడు ఈ రెండు పరిశ్రమలు రూపు దాలిస్తే.. జగన్ పేరు.. జిల్లాలో మారుమోగడం ఖాయం. ఇక ఇదే సమయంలో మంత్రివ‌ర్గ స‌మావేశంలో కాకినాడ సెజ్ క‌మిటీ నివేదిక‌ గురించి కూడా చర్చ జరిగింది. రైతులు ఇచ్చిన 2,180 ఎక‌రాలు వెన‌క్కి ఇవ్వాల‌ని క‌మిటీ నివేదించింది. కాకినాడ సెజ్ భూముల నష్టపరిహారం ఖరారుకు ఆమోదం లభించింది. కమిటీ సూచించిన పరిహారం కంటే ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: