పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తరపున పోటీకి సైతం అభ్యర్థులు వెనకాడిన పక్షంలో వైసీపీతోనే వైసీపీ రెబల్స్ పోటీ పడి విజేతలుగా నిలిచారు. ఈమధ్యలో జనసేన కూడా తమ సత్తా చూపించామంటూ ప్రకటించుకుంది. అయితే జనసేనకంటే కాస్త మెరుగ్గా బీజేపీ కూడా ఫలితాలు సాధించింది. అయితే ఆ ఫలితాలపై ఎక్కడా అగ్రనేతలు నోరు విప్పలేదు. తాము గెలుచుకున్న స్థానాలు ఇవీ అని ప్రకటించలేదు. ప్రకటనల్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉన్నా కూడా బీజేపీ ఆ జోలికే వెళ్లలేదు. అయితే ఇప్పుడు మున్సిపల్, పరిషత్ ఎన్నికల విషయంలో బీజేపీ కాస్త హడావిడి మొదలు పెట్టింది. ఎన్నికల బాధ్యతలను జిల్లాల వారీగా కీలక నేతలకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను నేతలకు కట్టబెడుతూ.. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాలకు ఇన్ ‌చార్జిలను నియమించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను జీవీఎల్‌ నరసింహరావు, కె.హరిబాబు, మాధవ్‌, విష్ణుకుమార్‌ రాజు, కాశీవిశ్వనాథ రాజులకు అప్పగించారు. గోదావరి, కృష్ణా జిల్లాల బాధ్యతలను సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ కు ఇచ్చారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్‌ బాబులను ఇన్ చార్జిలుగా నియమించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సీఎం రమేశ్‌, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి.. అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేశ్‌, పార్థసారథి, వరదాపురం సూరిలను నియమించారు.

మున్సిపల్ ఎన్నికలతోపాటు, పరిషత్ ఎన్నికలపై కూడా ఇన్ చార్జిలు ఫోకస్ పెడతారు. జిల్లా పార్టీ అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ వీరు ముందుకెళ్తారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియలు ఇప్పటికే ముగిశాయి కాబట్టి.. జనసేన అభ్యర్థులకు స్థానికంగా మద్దతివ్వడం, అవసరం ఉన్న చోట వారినుంచి మద్దతు స్వీకరించడం చేస్తారు. మొత్తమ్మీద పంచాయతీల్లో తమ ప్రతిభను చాటుకోలేకపోయామని, ప్రచారం చేసుకోలేకపోయామని అనుకుంటున్న బీజేపీ.. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకే పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. జిల్లాల వారీగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి మరీ పోరుకి సిద్ధమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: