పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యల ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి వారు మంథనిలో న్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్‌ రిపోర్టులో అనేక సంచలన విషయాలు కనిపించాయి. ఈ రిమాండ్‌ రిపోర్టును బట్టి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని తెలుస్తోంది. కుంట శ్రీనుపై కేసులు, ఫిర్యాదుల గురించి వామన్‌రావు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. శ్రీను గుంజపడుగు బస్టాండ్‌ వద్ద స్థలాన్ని కొని భవనం, సమీపంలోనే గుడిని నిర్మిస్తున్నాడు. రాధాగోపాలస్వామి ఆలయానికి కమిటీ ఏర్పాటు చేశాడు. వీటన్నింటినీ అడ్డుకునేందుకు వామన్‌రావు కేసులు వేయడంతో శ్రీనుకు అతడికి మధ్య వివాదం బాగా ముదిరింది.

వామన్‌రావు విషయమై కుంట శ్రీను పలుమార్లు బిట్టు శ్రీనుతో చర్చించి చివరకు ఎలాగైనా, ఎప్పుడైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు. అదను కోసం వేచిచూస్తున్నారు.  ఇక హత్య జరిగిన రోజు ఏం జరిగిందంటే.. గుంజపడుగు గ్రామంలో ఈనెల 17న జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కుంట శ్రీను తర్వాత దుబ్బపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యాడు. మంథని చౌరస్తాకు వచ్చేసరికి వామన్‌రావు దంపతులు కారులో మంథని కోర్టుకు వెళ్తుండడం కనిపించింది. వెంటనే బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. అతడు హత్య చేయడానికి కత్తులు, కారు, డ్రైవర్‌ చిరంజీవితో పాటు కోర్టు వద్ద రెక్కీకి లచ్చయ్య, కుమార్‌లను ఏర్పాటు చేశాడు.

ఈనెల 17న మధ్యాహ్నం 2.26కి పన్నూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి నిందితుల కారు కల్వచర్ల వైపు వెళ్లింది. మధ్యాహ్నం 2.29కి వామన్‌రావు దంపతుల కారు కల్వచర్లకు వెళ్లింది. మధ్యాహ్నం 2.41కి నిందితులు హత్య చేసిన తరవాత  వారి కారులోనే మంథనికి వెళ్తున్నట్లు తెలంగాణ చౌరస్తా ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజ్‌ దొరికింది. మొత్తంగా ఘటనకు సంబంధించి ప్రణాళిక పూర్తయ్యేసరికి రెండు గంటలు పట్టింది. కల్వచర్ల సమీపంలో వామన్‌రావు, నాగమణిలను హత్య చేసిన అనంతరం నిందితులు నేరుగా కారులో సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు రక్తసిక్తమైన తమ దుస్తులను బ్యారేజీలో పడేశారు. బ్యారేజీ నుంచి కారులో వాంకిడి చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ఆ రాత్రికి నిందితులు వాహనంలోనే పడుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: