కడపలో ఎప్పటిలాగే ఎన్నికల వేడి కొనసాగుతుంది.. నిన్నటి వరకు రచ్చ చేసిన పంచాయితీ ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అందరి దృష్టి పుర పాలక ఎన్నికల పై పడింది.మార్చి 2వ తేదీ నుంచి పురపాలక సంఘాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది నామినేషన్‌ వేసి మరణించిన అభ్యర్థులకు బదులుగా ఆయా పార్టీల తరఫున మరొకరితో పోటీ చేయించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి జిల్లాలో ఆరు పురపాలక సంఘాల్లో ఆరు వార్డుల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది..పార్టీ గుర్తులతో జరిగే ఈ ఎన్నికలకు నేతలు మరింత గట్టి పోటీని ఇస్తున్నారు. 


కడప నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉండగా 2014లో వైకాపా 42, తెదేపా 8 చోట్ల గెలుపొందాయి. ఈ సారి జరిగే ఎన్నికల్లో అన్ని వార్డు స్థానాలను కైవసం చేసుకునేందుకు వైకాపా పావులు కదుపుతోంది. ఇప్పటివరకు వైకాపా తరఫున 87, తెదేపా 44, స్వతంత్రులు 92, భాజపా 21, జనసేన 2, కాంగ్రెస్‌ 24, సీపీఐ 7, సీపీఎం 3, ఇతరులు 3 నామినేషన్లు దాఖలు చేశారు.ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో మొత్తం 40 వార్డులుండగా 2014లో జరిగిన ఎన్నికల్లో వైకాపా 18, తెదేపా 22 చోట్ల గెలుపొందాయి. ఈసారి వైకాపా ఛైర్మన్‌ పీఠం తప్పక దక్కించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 41 వార్డుల్లో ఇప్పటివరకు వైకాపా తరఫున 105, తెదేపా 80, స్వతంత్రులు 67, భాజపా 17, కాంగ్రెస్‌ 4, సీపీఐ 1, సీపీఎం తరఫున ఒక నామినేషన్‌ దాఖలైంది. వైకాపా అభ్యర్థిత్వానికి పోటీ ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కొందరిని బుజ్జగిస్తున్నారు.. ఈ నియోజక వర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ కొనసాగుతుంది.. 


జమ్మలమడుగు నగరపంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా 2014లో జరిగిన ఎన్నికల్లో తెదేపా 11, వైకాపా 9 చోట్ల గెలుపొందాయి. ఈ సారి ఛైర్మన్‌ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార వైకాపా భావిస్తోంది. ఇప్పటివరకు వైకాపా తరఫున 66, భాజపా 29, జనసేన 4, సీపీఐ 2, సీపీఎం 1, స్వతంత్రులు 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం వైకాపా, భాజపా మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది.. ఇదే తంతు మైదుకూరు, పులివెందులలో కొనసాగుతుంది.మైదుకూరు పురపాలక సంఘానికి 2014లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 23 వార్డులకు తెదేపా 17, వైకాపా 5, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలుపొందారు. ప్రస్తుతం వార్డుల సంఖ్య 24కి పెరిగింది. ఇప్పటి వరకు వైకాపా తరఫున 78, తెదేపా 32, స్వతంత్రులు 13, భాజపా 5, జనసేన 10, సీపీఎం 1, ఇతరులు 5 నామినేషన్లు దాఖలయ్యాయి.. పులివెందులలో మొత్తం 26 వార్డులకు 2014లో జరిగిన ఎన్నికల్లో 25 చోట్ల వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఈసారి అసలు ఎన్నికలే లేకుండా అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంలో వైకాపా నాయకులు సఫలమయ్యారు. పరిశీలన ముగిసే నాటికి వైకాపా 42, స్వతంత్ర అభ్యర్థులవి 7 నామినేషన్లు మిగిలాయి.2014 లో 8 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెదేపా 4, వైకాపా 4 వాటిల్లో ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకున్నాయి.. ఇప్పుడు వైసీపీ పార్టీ అన్నీ స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: