టూల్‌కిట్ వివాదంలో చిక్కుకుని అరెస్ట‌యిన ప్ర‌ముఖు ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారిణి దిశరవికి న్యాయస్థానంలో ఊరట లభించింది. దిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా మంగళవారం బెయిల్‌ మంజూరు చేస్తూ.. విబేధించినంత మాత్ర‌నా దేశ‌ద్రోహం అభియోగం ఎలా మోపుతారంటూ కాస్త‌గ‌ట్టిగానే పోలీసుల‌ను హెచ్చ‌రించింది. అదే స‌మ‌యంలో విబేధించ‌డం అనేది వివేక‌వంతుల హ‌క్కుగా భావించాల‌ని చుర‌క‌లంటించింది. అయితే దిశార‌వికి రూ.లక్ష వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తు తీసుకుని ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని పోలీసుల‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఖలిస్థాన్‌ అనుకూల ఉద్యమకర్తలైన ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (పీజేఎఫ్‌)తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని దిల్లీ పోలీసులు ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలోనే ఆమెపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. అయితే అభియోగాల‌కు సంబంధించిన స‌రైన ఆధారాలు పోలీసులు సమర్పించలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. వేర్పాటువాద ఆలోచనలతో ఆమెకు సంబంధం ఉందని చెప్పడానికీ ఆధారాల్లేవని చెప్పారు. అరకొర, రేఖామాత్రమైన ఆధారాలను పరిగణనలో తీసుకుని 22 ఏళ్ల యువతికి, అందునా ఎలాంటి ముందస్తు నేర చరిత్ర లేని అమ్మాయికి బెయిల్‌ నిరాకరించడానికి తగిన ప్రాతిపదిక కనిపించడం లేదన్నారు.


 కుమార్తెకు బెయిల్‌ లభించడంతో న్యాయవ్యవస్థపై తమ విశ్వాసం మరింత పెరిగిందని దిశ రవి తల్లిదండ్రులు బెంగళూరులో చెప్పారు. దేశంలో విబేధించిన వారికి దేశ‌ద్రోహం ముద్ర‌వేస్తోంది ఎన్డీఏ ప్ర‌భుత్వం అంటూ చాలాసార్లు ప్రజాస్వామిక‌వాదులు, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు ఆరోపించిన విష‌యం తెలిసిందే. తాజాగా దిశార‌వి విష‌యంలోనూ పోలీసుల వ్య‌వ‌హార శైలిని వారు త‌ప్పుబ‌డుతున్నారు. దిశార‌వి తీర్పుతో ఇప్ప‌టికైనా పోలీసుల్లోనూ, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రిల్లోనూ మార్పు రావాల‌ని వారు పేర్కొంటున్నారు. . ఢిల్లీ రైతు ఉద్యమానికి సంబంధించి టూల్‌కిట్‌ వ్యవహారంలో ముగ్గురు యువతుల అరెస్టు దేశ‌వ్యాప్తంగా కలకలం రేపింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.







మరింత సమాచారం తెలుసుకోండి: