కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతిపాలన విధించాలంటూ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ కేంద్ర హోంశాఖ‌కు సిఫార్సు చేసిన‌ట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్‌-డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం, ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఆమె ఈ  నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. ఇప్ప‌టికే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించిన‌ట్లు పుదుచ్చేరి రాజ‌కీయ‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఎన్డీయే అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌నుకుంటే అనుమ‌తి రాక‌పోతే ఆశ్చ‌ర్య‌పోవాలికానీ వ‌స్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డ‌మెందుక‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌గా ఉంది.

పుదుచ్చేరి రాజకీయ‌ పరిణామాల కారణంగా ముఖ్య‌మంత్రి వి.నారాయణస్వామి ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, డీఎంకేలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో నారాయణస్వామి బలనిరూపణ చేసుకోవాలని ఎల్‌జీ ఆదేశించారు. మరో మార్గంలేకపోవడంతో నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 14 మంది ఎమ్మెల్యేల బలమున్న ప్రతిపక్షపార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తుందేమోనని ఎల్‌జీ వేచిచూస్తున్నారు. అయితే ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి ప్ర‌భుత్వ ఏర్పాటుకు విముఖత చూపినట్టు  తెలిసింది.

త్వరలో ఎన్నికలు జరుగనుండడంతో ఈ కొద్దికాలానికి ఎందుకు తొంద‌ర‌ప‌డ‌ట‌మ‌ని రంగ‌స్వామి ఆలోచిస్తున్నారు.  నారాయణస్వామి ప్రభుత్వాన్ని కూల్చి, తను గద్దెనెక్కానన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని, ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని తాను.. ఇప్పుడలాంటి అపవాదుకు ఆస్కారం ఇవ్వ‌డం ఎందుక‌ని ఆయ‌న‌ మిత్రపక్షాలకు చెప్పినట్లు సమాచారం. దీంతో  అన్నాడీఎంకే, బీజేపీలు మెద‌ల‌కుండా ఉండిపోయాయి.  సోమవారం అసెంబ్లీలో జరిగిన స‌మావేశాల వీడియో దృశ్యాలను తెప్పించుకున్న గవర్నర్‌.. వాటిని  కేంద్రానికి పంపించనున్నారు. ఇప్పటికే ఆమె న్యాయనిపుణులతో చర్చించి ఒక నిర్ణయానికి వ‌చ్చార‌ని స‌మాచారం. నారాయణస్వామి, ఆయన మంత్రివర్గం చేసిన రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్‌ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో పుదుచ్చేరిలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు, అధిక‌ర ప‌క్ష‌, ప్ర‌తిప‌క్షాల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు, ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధించి ఉన్న అవ‌కాశాలు త‌దిత‌ర విష‌యాల‌పై లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కేంద్రానికి ఒక నివేదిక పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: