పంచాయతీ ఎన్నికలు అన్నారు, జరిగాయి, ఫలితాలు వచ్చాయి. ఏపీలో రాజకీయ కాకను పెద్ద ఎత్తున  పుట్టించాయి. ఎన్నికలు అయిపోయినా కూడా ఇంకా రాజకీయ పార్టీల మధ్య సీట్ల ఓట్ల  లెక్కలు తేలడంలేదు. ఆ మాటకు వస్తే అవి ఎప్పటికీ తేలే సమస్యే లేదు. ఎందుచేతనంటే పార్టీ గుర్తులు లేని ఎన్నికలు అవి. ఎవరికి వారు గెలిచిన వాడు మావాడే అనేసుకుంటున్నారు.

మరి ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది అన్నది ఎలా తెలుస్తుంది. అంటే మునిసిపల్ పోల్స్ ని బట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మునిసిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద ఆధారపడి జరుగుతాయి. పైగా మేధావులు, విద్యావేత్తలు, చదువరులు సహా అన్ని వర్గాల ఓటర్లు ఉండే చోటు మునిసిపాలిటీ. అలాగే పల్లె జనం కూడా ఇక్కడ ఉంటారు. మొత్తానికి ఒక కచ్చితమైన అభిప్రాయం రావడానికి మునిసిపల్ ఎన్నికలు సాధనం అని అంటున్నారు.

రాష్ట్రంలో మార్చి 10న జరిగే మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం తొంబై లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు. అదే విధంగా ఆనాటికి ఏపీలో వైసీపీ పరిపాలన 21 నెలలు పూర్తి అవుతుంది. జగన్ ఈ మధ్య కాలంలో ఏం చేశారు అన్న దాని మీద జనాలకు ఉన్న క్లారిటీ కూడా ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు రూపంలో బయటపడుతుంది అంటున్నారు.

ఇక మునిసిపల్ ఎన్నికల్లో వచ్చే తీర్పు మాత్రం కచ్చితమే అంటున్నారు. పార్టీ గుర్తులను చూసి ఓట్లేస్తారు కాబట్టి గెలిచిన వాడు మావాడు అని ఎవరూ చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. దాంతో పంచాయతీ ఎన్నికల్లో మాకు ఇంత ఓట్ల శాతం వచ్చిందంటే మేమే గెలిచామని చెప్పుకుంటున్న అన్ని పార్టీలకు మునిసిపల్ ఎలెక్షన్లు గట్టి తీర్పునే ఇవ్వబోతున్నాయి.  ఇక్కడ కనుక వైసీపీ గెలిస్తే మాత్రం ఆ పార్టీకి ఇప్పట్లో తిరుగులేదని భావించాలి. అదే తెలుగుదేశం గెలిస్తే మాత్రం గాలి మారుతోంది. మార్పు వస్తోంది అని అంచనా వేయవచ్చు. మొత్తానికి పంచాయతీ ఫలితాలను చూసి జగన్, బాబు చంకలు గుద్దుకోవడం కాదు, అసలైన ఫైట్ ముందుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి పార్టీ పెద్దలు రెడీనా.

మరింత సమాచారం తెలుసుకోండి: