ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మండిప‌డ్డారు.  దుర్గ‌గుడిలో అవినీతి నిరోధ‌క‌శాఖ జ‌రిపిన  సోదాల్లో అస‌లైన దొంగ‌ను ప్ర‌భుత్వం వ‌దిలేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అస‌లు దొంగ రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావేన‌ని, అత‌న్ని వ‌దిలేసి చిరుద్యోగుల‌ను ప‌ట్టుకోవ‌డమ‌నేది మంత్రిని కాపాడ‌టానికేన‌ని బుద్ధా వెంక‌న్న విరుచుకుప‌డ్డారు.

దుర్గ గుడిలో జ‌రిగిన ఏసీబీ సోదాల్లో వెల్లంప‌ల్లిని వ‌దిలేసి చిరుద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, అవినీతి తిమింగ‌లాన్ని వ‌దిలేశార‌ని బుద్ధా వెంక‌న్న ధ్వ‌జ‌మెత్తారు. దేవాదాయ‌శాఖ మంత్రిగా ఉండి రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత దోపిడీకి మంత్రి పాల్ప‌డ్డార‌ని వెంక‌న్న ఆరోపించారు. దుర్గ‌మ్మ దేవాల‌యంలో మాయ‌మైన చీర‌లు వెల్ల‌ప‌ల్లి ఇంట్లో, ఆయ‌న దుకాణంలో ఉంటాయ‌ని, దేవాల‌యంలోని స్టోర్ లో ఉండే స‌ర‌కులు కూడా మంత్రి ఇంటికే చేర‌తాయ‌ని తెలిపారు. కోటిరూపాయ‌లు అమ్మ‌వారికి కానుక‌ల రూపంలో వ‌స్తే రూ.50 లక్ష‌లు మంత్రే దోచేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న అవినీతి బాగోతాల‌కు అంతేలేద‌ని, ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని  బుద్దా వెంక‌న్న కోరారు.

రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో కూడా అవినీతి నిరోధ‌కశాఖ త‌నిఖీలు జ‌రిపితే మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అవినీతి భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌న్నారు.  వెల్లంపల్లిని తక్షణమే అరెస్ట్ చేసి, విచారిస్తే దేవాలయాల సాక్షిగా ఆయన సాగిస్తున్న దోపిడీ బయటపడుతుందని తెలిపారు. దేవుడి సొమ్ము రూపాయి కూడా తాను తినలేదని దుర్గమ్మ సన్నిధిలో తన బిడ్డలపై ప్రమాణం చేసి మంత్రి శ్రీనివాస్ చెప్పగలడా? అని బుద్ధా వెంక‌న్న సవాల్ విసిరారు. ఇదొక్క‌టే కాద‌ని మంత్రి పాల్ప‌డుతున్న అవినీతిపై, ఆయ‌న బాగోతాల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. అవినీతి తిమింగ‌లాన్ని వ‌దిలేసి చిరుద్యోగుల‌పై ప్ర‌తాపం చూపితే ఏం ఉప‌యోగం ఉంటుంద‌ని, అలా కాకుండా అవినీతిని నిర్మూలించాల‌నే చిత్త‌శుద్ధే ముఖ్య‌మంత్రికి ఉంటే మంత్రి వెల్లంప‌ల్లి అవినీతిపై చ‌ర్య‌లు తీసుకొని ప్ర‌జ‌ల‌కు మంచి సందేశ‌మివ్వాల‌ని బుద్ధా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: