ట్విట్ట‌ర్ రెడ్డి మ‌రోసారి ట్వీటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్త‌రాంధ్ర బాధ్యుడు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు. ట్విట్ట‌ర్ ద్వారా మండిప‌డ్డారు. ప్ర‌త్య‌క్షంగా కాకుండా ప‌రోక్షంగా యుద్ధం చేయ‌డంలో ఆరితేరిన విజ‌యసాయిరెడ్డి ప్ర‌త్య‌ర్థుల‌ను విమ‌ర్శించ‌డంలో కూడా ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు, అధికారంలో లేన‌ప్పుడు కూడా త‌న‌దైన శైలిలో రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని కొన‌సాగించిన సాయిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా అదే శైలిని కొన‌సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓట‌మిపాలై 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ ఆయ‌న తీరుమార‌లేద‌ని విమ‌ర్శించారు. అప్పుడు ఇలాగే గుడ్డ‌లు చించుకున్నార‌ని, ఇప్పుడు పంచాయితీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఇలాగే గుడ్డ‌లు చించుకుంటున్నార‌ని విజ‌యసాయిరెడ్డి అన్నారు.

ఇప్పుడూ అదే ఏడుపు రిపీట్ అయిందని... ఎప్పటిలాగే అధికారులను, పోలీసులను చంద్ర‌బాబు బెదిరించారని విజ‌య‌సాయిరెడ్డి ట్వీటారు. వైఎస్సార్ కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు తప్పు చేసారని తేల్చార‌న్న‌చంద్రబాబుకు పూర్తిగా మతి భ్రమించిందని... పోలీసు అధికారులను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరు చూస్తుంటే తక్షణం ఎర్రగడ్డలో చేర్చాల్సిన పరిస్థితి కనిపిస్తోందని సాయిరెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు.

'అందరి వివరాలు రాసుకున్నారంట. ఆధారాలు కూడా ఉన్నాయంట. జమిలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిన వెంటనే ఆయన సీఎం అయి తన పవరేంటో చూపిస్తారంట. 41 శాతం సర్పంచ్ పదవులు గెలిచామంటూ జబ్బలు చరుస్తున్నారు. హిందూపురం, అమరావతి, కుప్పంలోనే డిపాజిట్లు రాలేదు. మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నచోట సింగిల్ డిజిట్ దాటలేదు. మీ కాకిలెక్కల్ని జనం నమ్ముతారా? దమ్ముంటే గెలిచారంటున్న పంచాయతీలను ఎల్లో పేపర్లలోనైనా ప్రకటించండి.  విశాఖ ఉక్కు క‌ర్మాగారంపై ప్ర‌ధాన‌మంత్రికి రాసిన లేఖ‌తో తాను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబునాయుడు అంగీకరించారు. జగన్ గారి ప్రభుత్వం ఉక్కు క‌ర్మాగారాన్ని  ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేశారు. కేంద్ర బడ్జెట్ లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించారు' అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: