ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా విద్యారంగం గురించి.. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ సర్కారు.. పాఠశాల విద్యపై కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు.. అమ్మఒడి, నాడు నేడు వంటి పథకాల ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు  సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని జగన్‌ నిర్ణయించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి 1-7 తరగతులకు సీబీఎస్‌ఈసీ విధానం అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.  ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి తేవాలని జగన్ నిర్ణయించారు.  ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్  ఆదేశించారు. ఇది ఒక రకంగా సంచలన నిర్ణయమే.

తమ పిల్లలకు ఆంగ్ల విద్య కోసం చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. జగన్ ఆ సమస్య తీర్చారు. ఇప్పుడు ఏకంగా సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెట్టడం ద్వారా మరో అడుగు ముందుకేశారు. అటు సీఎం జగన్ విద్యాకానుక పై సమీక్ష నిర్వహించారు. విద్యాకానుకలో ఇంగ్లీష్‌, తెలుగు డిక్షనరీలను చేర్చాలని.. దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకూ డిక్షనరీలు ఇవ్వాలని చెప్పారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల నాణ్యత, సర్వీసు బాగుండాలన్నారు.


నాడు-నేడు పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని... జగన్ అన్నారు. పాఠశాలలు మంచి డిజైన్లతో ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. మౌలిక సదుపాయాల్లో రాజీ పడొద్దని.. పనులు పూర్తయిన నిర్మాణాల ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. రెండో దశ పనులను కూడా సత్వరమే ప్రారంభించాలని.. తొలిదశలో ఎదురైన ఇబ్బందులను అధిగమించాలని అధికారులకు జగన్‌ అధికారులకు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: