విశాఖ ఉక్కు.. ఆంధ్రుల సెంటిమెంట్.. ఆంధ్రుల ఆత్మగౌరవంగా చెప్పుకుంటారు. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపైకి ఈ అంశం హాట్ టాపిక్‌ గా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఏపీలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. టీడీపీ, వైసీపీ, బీజేపీ,జనసేన.. ఇలా దీన్ని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మొన్న టీడీపీ నేత పల్లా శీను నిరాహారదీక్ష చేశారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పాదయాత్ర చేశారు.


అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగేలా లేదు. దీనిపై ప్రధాని మోడీ పిచ్చ క్లారిటీగా చెప్పేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆదుకునేది లేదని.. ప్రైవేటుపరం చేసి తీరతామని కుండ బద్దలు కొట్టేశారు.. చాలా ఏళ్ల నుంచి ఉన్నాయని.. వారసత్వం ఉందని.. చరిత్ర ఉందని.. ఏ పరిశ్రమనూ వదిలిపెట్టబోమని.. ఆదుకునేది లేదని ప్రధాని మోడీ క్లారిటీగా చెప్పారు.


వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వాటి ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక సాయం అందించడం భారమని తేల్చి చెప్పారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని... నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.


డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోడీ ఈ విషయాలను తేల్చి చెప్పారు. అసలు వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుందని చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని ప్రధాని మోడీ వివరించారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్లుతున్నామని చెప్పారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందన్నారు. ప్రైవేటు రంగం పెట్టుబడులు, అత్యుత్తమ విధానాలను తెస్తుందని వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: