ప్రధాని నరేంద్రమోడీ ప్రైవేటీకరణే తమ ఎజెండా అని ప్రకటించేశారు. కీలకమైన నాలుగు రంగాలు మినహా అన్నీ ప్రైవేటుపరం చేసేస్తామని ప్రకటించేశారు. అసలు ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకోవడమే తప్పని ప్రధాని మోడీ అంటున్నారు. ప్రభుత్వం చేయాల్సింది సంక్షేమేనని ఆయన అంటున్నారు. అంతేకాదు.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు చేస్తామని తేల్చి చెప్పారు. నిరర్థక ఆస్తుల అమ్మకం ద్వారా ఏకగా రెండున్నర లక్షల కోట్లు సంపాదిస్తామన్నారు. 

అసలు వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుందని చెప్పారు.




మోడీ చేసిన ఈ ప్రకటనతో భారత్ భవిష్యత్ ఏంటో అర్థమవుతోంది. ప్రైవేటీకరణ మరింత జోరందుకోబోతోంది. ఇప్పటికే మోడీ సర్కారు అదానీలు, అంబానీల కోసమే పని చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధాని మోడీ మరోసారి ఆ విమర్శలను నిజం చేసేలా కనిపిస్తున్నారు. అయితే దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రభుత్వం పని కేవలం ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడం.. సంక్షేమం చూసుకోవడం తప్ప వ్యాపారం కాదని కొందరు మేథావులు కూడా చెబుతుంటారు. వ్యాపారం అన్నది ప్రైవేటు రంగానికి వదిలేయాలని చెబుతుంటారు. ప్రైవేటీకరణ వల్ల అనేక మేళ్లు జరుగుతాయని చెబుతుంటారు. పోటీ పెరిగి వినియోగదారుడుకి నాణ్యమైన వస్తువు లభిస్తుందని అంటారు. కొంత వరకూ ఇది నిజమే కావచ్చు. కానీ మొత్తం ప్రైవేటీకరణ చేసుకుంటూ పోటీ.. కార్పొరేటు కంపెనీలదే రాజ్యం అవుతుంది. ఏ వస్తువు ధరనైనా నియంత్రించేది కార్పొరేట్ కంపెనీలే అవుతాయి. అప్పుడు ధరలు విచ్చలవిడిగా పెరుగుతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ఇందుకు తాజా ఉదాహరణగా విపరీతంగా పెరుగుతున్న స్టీల్, సిమెంట్‌ ధరలనే చెబుతున్నారు. స్టీల్ రంగంలో ప్రైవేటు గుత్తాధిపత్యం కారణంగా అవి సిండికేట్ అయ్యి తాము ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూపోతున్నారు. ఈ విషయంపై గతంలో కేంద్ర మంత్రి గడ్కరీ కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు. రేపు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: