మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టార్గెట్ గా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు టీడీపీ ఇప్పుడు మంత్రిని విజయవాడలో ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సమాచార శాఖా మంత్రి పేర్ని నానీ మీడియాతో మాట్లాడారు. దుర్గ గుడి ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తే మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయం అని ఆయన అన్నారు. అక్రమాలు సహించేదే లేదంటూ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోంది అని ఆయన స్పష్టం చేసారు.

దుర్గగుడి ఉద్యోగులపై ఏసీబీ సోదాల విషయంలో రాజకీయ ఆరోపణలు చేయడం దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దుర్గ గుడి ఈవో తప్పు చేశారనే లెక్క తేలితే బొక్కలు పగులుతాయి అని అన్నారు. అవినీతిని ఊపేక్షించే విషయంలో ఈవో లేదు.. డీవో లేదు.. అందరి  మీద చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేసారు. చంద్రబాబు హయాంలో ఓ చీఫ్ ఇంజినీరుపై ఏసీబీ దాడులు చేస్తే అప్పటి మంత్రి నారాయణకి వాటిని అంటగట్టగలరా..? అని నిలదీశారు. దుర్గ గుడిలో జరుగుతోన్న వ్యవహారాలను మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతోంది అని విమర్శలు చేసారు.

రాజకీయ వాతావరణం బట్టి జనసేన అభిప్రాయలు మారిపోతున్నాయి అని అన్నారు. ఈబీసీ రిజర్వేషన్లపై సీఎం జగన్ సరైన సమయంలో స్పందిస్తారు అని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం అమరావతికి నిధులను కేటాయించారనే ఆరోపణలు అర్ధరహితం అని ఆయన పేర్కొన్నారు. అమరావతి పరిధిలో..  కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీనే ఎక్కువ స్థానాలు గెలిచింది అని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మేం.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందలేమా..? అని నిలదీశారు. అమరావతిని అభివృద్ధి చేస్తామనే సీఎం ప్రతీ సందర్భంలో చెబుతూనే ఉన్నారు అని అన్నారు. చంద్రబాబు బుర్రను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని, చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: