లేటుగా వ‌చ్చినా.. లేటెస్ట్ రాజ‌కీయాలు చేయ‌డంలో త‌న‌దైన ముద్ర‌ వేసుకున్నారు టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌.  పెద్ద‌గాచ‌దువుకోక‌పోయినా.. రాజకీయంగా ఆయ‌న శైలిని ఎవ‌రూ వంక పెట్ట‌లేని ప‌రిస్థితి. ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ.. అధికార పార్టీ వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డంలో సీనియ‌ర్లను సైతం మించిపోయిన ఆయ‌న చుట్టూ ఇప్పుడు వివాదాలు రాజుకున్నాయి. విజ‌య‌వాడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న బుద్దా.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం స‌హా సెంట్ర‌ల్‌లోని స‌గ‌భాగాన్ని తనే స్వ‌యంగా ప‌రిశీలిస్తున్నారు. ఇది ఎంపీ కేశినేని నానికి కంట‌గింపుగామారింది.

ఎంపీగా రెండు సార్లు గెలిచిన త‌న‌దే ఆధిప‌త్య కావాల‌ని ఆయ‌న చూస్తున్నారు. అయితే.. పార్టీలో క్రియాశీ లంగా ఉన్న త‌న‌ను కాద‌ని ఎంపీ వ్య‌వ‌హ‌రిస్తారా? క‌నీసం త‌న‌తో సంప్ర‌దించకుండానే ప్ర‌చారం ప్రారంభి స్తారా? అనేది బుద్ధా ప్ర‌శ్న‌. ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా.. భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, దీనికితోడు.. నానిని ఒంట‌రిని చేస్తూ.. మిగిలిన వారంతా మౌనం పాటించారు. అయితే.. అదేస‌మ‌యం లో బుద్ధాకు మ‌ద్దతు కూడా ప‌ల‌క‌డం లేదు. అంటే.. ఒక‌ర‌కంగా.. ఇటు బుద్ధా.. అటు నాని కూడా ఒక‌రిపై ఒక‌రు ఒంట‌రిగానే ఆధిప‌త్య పోరాటం చేసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పంచాయ‌తీ పోరులో.. నాని కుమార్తె శ్వేత‌.. మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌చారంలో ఉన్నారు. అయితే.. బుద్ధా మాత్రం దీనిని ఒప్పుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రేపు నాని విజ‌యం సాధిస్తే.. బుద్ధాను రాజ‌కీయంగా ఇబ్బంది పెడ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పోనీ.. నాని ఓడిపోయినా.. బుద్ధా క‌నుక విజ‌యం సాధించ‌లేక పోతే.. అంటే.. ఆయ‌న అనుచ‌రులు కార్పొరేట‌ర్లుగా గెల‌వ‌క‌పోతే.. పార్టీలో ఆయ‌న ఒంట‌రిగానే మిగిలిపోతార‌ని.. ఏతావాతా ఎలా చూసుకున్నా..నాని వంటి బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం.. ఆర్థికంగా ద‌న్నున్న నాయ‌కుడితో ఢీ అంటే.. బుద్ధాకే న‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: