గుంటూరు మేయర్ పీఠం కోసం టీడీపీలో మూడు ముక్క‌లాట సాగుతోంది. ఈ పీఠం మాకు కావాలంటే.. మాకే కావాలంటూ.. నాయ‌కులు ప‌ట్టుబ‌డుతున్నారు. అందరూ కీల‌క నేత‌లే కావ‌డంతో ఎవ‌రికి ఎలాంటి హామీ ఇస్తే.. ఏమ‌వుతుందోన‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఆవేద‌న చుట్టుముట్టింది. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ప్ర‌చారం హోరెత్తుతోంది. అయితే.. కీల‌క మైన న‌గ‌రాల్లో మేయ‌ర్ పీఠం విష‌యంలో టీడీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌, గుంటూరు వంటి కీల‌క న‌గ‌రాల్లో ఈ పీఠం ద‌క్కించుకునేందుకు నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠాన్ని ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత‌కు కేటాయించారు. అయితే.. అప్ప‌ట్లో అంటే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రూ మౌనంగా ఉన్న ఈ నిర్ణ‌యంపై ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అప్ప‌ట్లో ఓకే అన్నాం.. కానీ.. ఇప్పుడు మార్చుకోవాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ విష‌యం పార్టీలో చిచ్చుపెట్టింది. ఇక‌, గుంటూరు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం పార్టీలో యాక్టివ్‌గా ఉన్న నాయ‌కుల మ‌ధ్య మేయ‌ర్ పీఠంపై ఆశ‌లు ఉన్నాయి. ముఖ్యంగా కోవెల మూడి ర‌వీంద్ర మేయ‌ర్ రేసులో ఉన్నాన‌ని చెప్పుకొంటున్నారు. భారీగానే ఖ‌ర్చు పెడుతున్నారు.

అయితే.. అదే స‌మ‌యంలో మాజీ ఎంపీ రాయ‌పాటి కుటుంబం కూడా ఈ పీఠంపై ఆశ‌లు పెట్టుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత సైలెంట్ అయిపోయిన ఈ కుటుంబం.. ఇప్పుడు త‌మ‌కు మేయ‌ర్ పీఠం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. అంతేకాదు.. మొత్తంగా గెలిపించుకునే బాధ్య‌త కూడా త‌మ‌దేన‌ని అంటుండడం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ కూడా త‌న ఫ్యామిలీ స‌భ్యుల‌కు మేయ‌ర్ పీఠం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు ఈ క్ర‌మంలో ఆయ‌న దీనిపై పార్టీ అధినేత చంద్ర‌బాబుపై ఒత్తిడి చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే.. ఈ విష‌యం ముందు ముందు ముదురుతుందా?  లేక చంద్ర‌బాబు చెక్ పెడ‌తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: