పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో జనసేనలో కొత్త ఉత్సాహం నెలకొంది అన్నమాట వాస్తవం. అందులోనూ జనసేనను కించపరచి, జనసేనానిని తూలనాడి పార్టీ మారిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సొంత నియోజకవర్గం రాజోలులో జనసేన గణనీయంగా సర్పంచ్ స్థానాలు దక్కించుకుంది. అదే ఊపులో ఇప్పుడు మున్సిపాల్టీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనుకుంటున్నారు జనసైనికులు. మార్చి 10న జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.

అభ్యర్థుల సంగతేంటి..?
వాస్తవానికి గత మున్సిపల్ ఎన్నికల సమయానికి జనసేనలో అంత ఊపులేదు. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాస్త జోష్ పెరిగింది. ఈ ఊపు కంటిన్యూ చేయడానికి పురపోరుని అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారు. అభ్యర్థులు లేకపోవడంతో.. తటస్థులకు మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశం ఉంటే, ఈసీ అంగీకరిస్తే.. తటస్థుల్లో కొంతమందికి బీ ఫారం ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థులు లేరనే ఇబ్బంది తొలగించుకోడానికి పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిపికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయపోరాటం చేస్తోంది జనసేన.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా పడకేసిందనే విషయం అర్థమైపోయింది. ఈ దశలో ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే కచ్చితంగా రాజకీయ రణక్షేత్రంలోకి దిగాల్సిందే. అటు బీజేపీతో క్షేత్ర స్థాయిలో పొత్తు ఉన్నా కూడా... ఎక్కడా ఇరు పార్టీలకు లాభం చేకూరిన సందర్భమే లేదు. నాయకులు కలసిపోతున్నా, కార్యకర్తల్లో ఇంకా భేదభావం ఉంటూనే ఉంది. దీంతో సొంతగా అయినా తమ సత్తా చూపాలనుకుంటున్నారు జనసైనికులు. రాజోలు నియోజకవర్గంలో పొత్తు ధర్మాన్ని పక్కనపెట్టి కొన్ని చోట్ల టీడీపీ బలపరచిన అభ్యర్థులకు జనసైనికులు మద్దతిచ్చారు. మరికొన్ని చోట్ల టీడీపీ నుంచి మద్దతు తీసుకున్నారు. మొత్తమ్మీద రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి గట్టి షాకిచ్చారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఈమేరకు నాదెండ్ల మనోహర్ కి దిశా నిర్దేశం చేశారు. నాదెండ్ల క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ పురపోరుపై దృష్టిపెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: