రాష్ట్రంలో ఇపుడు స్థానిక పోరు సాగుతోంది. పంచాయతీలు పూర్తి అయ్యాయి. పుర పోరుకు రంగం సిధ్ధం అయింది. మార్చి 10వ తేదీతో ఇది కూడా జరిగిపోతుంది. అయితే అన్నింటికంటే మించినది అయిన తిరుపతి ఉప ఎన్నికల పోరు ఉండనే ఉంది. సెప్టెంబర్ లో కరోనా కారణంగా మృతి చెందిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్  సీటు తిరుపతి లోక్ సభ‌. ఇక్కడ ఉప ఎన్నిక ఆరు నెలల వ్యవధిలో జరగాల్సి ఉంది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే అందరి దృష్టి అటు వైపే ఉండేది. కానీ మధ్యలో ఈ ఎన్నికలు రావడంతో ఫోకస్ మారింది. దాంతో పాటే తిరుపతి ఉప ఎన్నికల మీద ఆసక్తి కూడా మెల్లగా కరిపోతోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. ఇక  మునిసిపాలిటీల ఎన్నికలు  కూడా జరిగితే ఏపీలో రాజకీయ ముఖ చిత్రం కచ్చితంగా బయటకు వస్తుంది. ఏ పార్టీకి ఏపీలో బలం ఉంది. ఎవరి బలహీనతలు ఏంటి అన్నది కూడా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఇదివరకు ఉన్న ఉత్సాహం ఇపుడు రాజకీయ పార్టీలలో కనిపించడం లేదు. దానికి గత నెల రోజుల్లో మారిన రాజకీయమే. పంచయతీ పోరులో అధికార పార్టీ పెద్ద ఎత్తున గెలుచుకోవడంతో విపక్షాలు డీలా పడ్డాయని చెప్పవచ్చు. ఇక మునిసిపల్ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ మెజారిటీ సీట్లను సాధించడం లాంచనమే. దాంతో ఇవి బేరీజు వేసుకున్న విపక్షాలు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏవో అద్భుతాలు జరిగిపోతాయని అసలు అనుకోవడంలేదు.

దానికి తోడు బీజేపీ  ఇన్నాళ్ళూ తిరుపతి ఉప ఎన్నిక అంటూ ఉరికింది. కానీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయించడం ఆ పార్టీకి శరాఘాతంగా మారుతోంది అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చిత్తూరు జిల్లాలో  మొత్తం పంచాయతీ ఎన్నికల ఫలితాలు  నిరాశనే మిగిల్చాయి. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలు జరిగినా వైసీపీ గెలవడం ఖాయమన్న భావన అంతటా ఉంది. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల వేడి మాత్రం రాజకీయ పార్టీలలో లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: