పంచాయతీ ఎన్నికల వేళ విజయం మాదేనంటూ వీరలెవ్లలో డైలాగులు కొట్టిన చంద్రబాబు.. తీరా ఫలితాలు వచ్చే సరికి చప్పబడ్డారు. అధికార పక్షం దౌర్జన్యం అంటూ నింద వైసీపీపై నెట్టేశారు. తీరా ఇప్పుడు పురపోరుపై ఆయన పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడంలేదు. కుప్పంలో పర్యటించిన సందర్భంలో కూడా పురపోరుకి సిద్ధంగా ఉండాలని ఎవరికీ ఉపదేశం ఇవ్వలేదు. అయితే అదే సమయంలో జమిలి తరుముకొస్తుందంటూ సెలవిచ్చారు బాబు.

ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వస్తే వైసీపీ ఇంటికెళ్లడం ఖాయమని అన్నారు చంద్రబాబు. వైసీపీ నైతికంగా పతనమైందని.. ప్రజలు తిరుగుబాటు చేస్తే అధికార పార్టీ నాయకులు పారిపోతారని వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద జమిలిపై బాబు గట్టి నమ్మకమే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జమిలి ఎన్నికలు జరిగితే తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు బదులు తీర్చుకుంటామని అన్నారు. చక్రవడ్డీతో బదులిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో రద్దు చేస్తానని భరోసా ఇచ్చారు. కుప్పంలో పులివెందుల రౌడీయిజం జరగనివ్వబోనన్నారు బాబు.

పురపోరుపై చంద్రబాబుకే కాదు, అటు పార్టీ నేతల్లో కూడా ఉత్సాహం ఉన్నట్టు కనిపించడంలేదు. పార్టీ పటిష్టంగా ఉన్న విశాఖలో కూడా టీడీపీకి అవకాశాలులేవని తేలుతోంది. నలుగురు ఎమ్మెల్యేలలో ఆల్రడీ ఒకరు వైసీపీకి మద్దతు తెలిపారు. గంటా శ్రీనివాసరావు లోపాయికారీగా వైసీపీకి సపోర్ట్ చేస్తారనే అనుమానం ఉంది. ఇక మిగతా ఇద్దరితో ఎంతమేరకు ప్రయోజనం ఉంటుందో చూడాలి. అటు గుంటూరు, విజయవాడలో కూడా టీడీపీ పరిస్థితి మెరుగ్గా లేదని సమాచారం. దీంతో పురపోరుని చంద్రబాబు పూర్తిగా వదిలేశారని అంటున్నారు. అందుకే ఆయన జమిలి ఎన్నికలను గుర్తు చేస్తున్నారని. తొందరలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వస్తే తమ సత్తా చూపిస్తామని అంటున్నారు. కార్యకర్తలను కూడా జమిలి ఎన్నికలకు సిద్ధం చేసేలా ప్రవర్తిస్తున్నారు బాబు.

పురపోరుపై చంద్రబాబు కూడా డీలా పడటంతో.. రేపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో చాలామంది టీడీపీ అభ్యర్థులు బరిలోనుంచి తప్పుకోడానికే అవకాశం ఉన్నట్టు అర్థమవుతోంది. పంచాయతీల్లో గెలుపుకోసం ఆర్థికంగా నష్టపోయిన అభ్యర్థులను చూసి మున్సిపల్ పోరులో నిలిచినవారికి జ్ఞానోదయం అయిందని, వారంతా పోటీకి దూరంగా ఉంటున్నారని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: