కడప జిల్లాలో పుర పాలక ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు వేయడానికి ముందే ప్రచారాన్ని  ప్రారంభించారు వైసీపీ నేతలు. జిల్లాలో పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి నామపత్రాల ఉపసంహరణ తేదీ సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ నేతలు ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. ఆయా పురపాలక సంఘాల్లో ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి వ్యతిరేక వర్గం అభ్యర్థులు నామపత్రాలు ఉపసంహరించుకునేవిధంగా చర్చలు జరుపుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు పట్టు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.



కడప నగరపాలక సంస్థలో ఎక్కువ వార్డులను వైకాపా గెలుపొందేందుకు ముగ్గురు ప్రధాన నాయకులు కృషిచేస్తున్నారు. చిన్నచౌకు పరిసర ప్రాంతాల్లో మాజీ మేయరు సురేష్‌బాబు, పాత కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, విలీన ప్రాంతాల్లో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని డివిజన్లలో వైకాపా నుంచే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. మరికొందరు రెబల్‌గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. వీళ్లందరినీ బుజ్జగించేందుకు నాయకులు తలలు పట్టుకున్నారు. 2020 లో నామినేషన్ వేసిన కొందరు ప్రత్యర్థులు నిన్న వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.



మైదుకూరు పురపాలక సంఘంలో వెంకటాపురం ప్రాంతానికి చెందిన తెదేపా నాయకుడు ఒకరు తాజాగా వైకాపాలో చేరారు. పలు వార్డుల్లో నామినేషన్లు వేసిన తెదేపా అభ్యర్థులను పోటీలో నుంచి తప్పు కునేవిధంగా డబ్బు ఆశ చూపుతున్నట్లు సమాచారం. ఎర్రగుంట్ల నగరపంచాయతీలో మొత్తం 20 వార్డులకు ఇప్పటికే 6 వార్డుల్లో ఒకే నామినేషన్‌ మాత్రమే ఉంది. మరో 6 చోట్ల ప్రత్యర్థి అభ్యర్థులు ఉపసంహరించుకు నేవిధంగా వైకాపా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.. జమ్మలమడుగు లో తెదేపా కు ఒక్క నామినేషన్ కూడా రాలేదు. బద్వేల్ , రాయచోటిలో పరిస్థితి అదే విధంగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తెదేపాకు చెందిన ఓ నాయకుడు వైకాపాకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. ఆయనే స్వయంగా కొంతమంది తెదేపా అభ్యర్థులను ఉప సంహరించుకోవాలంటూ సూచిస్తున్నారు. 1వ వార్డులో గతేడాది నామినేషన్‌ వేసిన భాజపా అభ్యర్థి మరణించడంతో ఆయనకు బదులు మరొకరు పోటీ చేయాల్సి ఉండగా ఏకగ్రీవం చేసుకోవాలని వైకాపా భావిస్తోంది.. మొత్తానికి కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ జెండా పాతెందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: