ఫాంహౌస్ అంటే అందరికి అర్థమయ్యేదేంటి?  విజ‌య్‌మాల్యా, నీర‌వ్‌మోడీ లాంటి దేశం విడిచిపోయిన ఆర్థిక నేర‌స్తుల‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఎలా పోలుస్తారంటూ ప‌లువురు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. తెలంగాణ భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్‌మీద విరుచుకుప‌డుతున్నారనే విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న కేసీఆర్‌ను మాల్యా, నీర‌వ్‌మోడీల‌తో పోల్చ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేంద్రంలో బీజేపీనే పవర్లో ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే తప్పు చేసి ఉంటే.. ఈపాటికి చర్యలు తీసుకునేవారుక‌దా? అలాంటప్పుడు చర్యల మీద దృష్టి పెట్ట‌కుండా  పస లేని విమర్శల్ని పదే పదే చేయటం ఎందుకు అన్నది అంద‌రి నుంచి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌.

కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయటమే బండి సంజ‌య్ లక్ష్యమైతే.. అందుకు తగిన కారణాల్ని ప్రజలకు చూపాలే కానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న గౌర‌వ‌మ‌ర్యాద‌లు త‌గ్గుతాయ‌నే విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దంటున్నారు. నోరు తెరిస్తే చాలు ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని సంజ‌య్ మండిప‌డుతున్నారు. ఏవి అబ‌ద్దాలో? ఏవి నిజాలో ప్ర‌జ‌లే తేల‌స్తుర‌నే అభిప్రాయం స‌మాజం నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. కానీ సంజ‌య్ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా భావిస్తున్నారు.

బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయ‌లు టోపీ పెట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో సీఎం కేసీఆర్ ను పోల్చ‌డంపై అంద‌రినుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ‘మన దేశం నుంచి తప్పించుకొని పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ కోర్టు భారత్ కు అప్పగించేందుకు సిద్ధమైంది. దేశాన్ని దోచుకున్న దొంగలు ఎక్కడున్నా వారిని పట్టి జైల్లో పెడతాం’ అని బండి ప‌రోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించార‌నేది తెలంగాణ స‌మాజం భావ‌న‌గా ఉంది. ఇప్ప‌టికైనా విమ‌ర్శ‌లు చేసేముందు ఎవ‌రేమిట‌నేది చూసుకొని మాట్లాడాల‌ని, అంతేకానీ రాజ‌కీయంగా దూకుడుగా వెళ్దామ‌నే భావ‌న‌లో ఏది మాట్లాడితే అది మాట్లాడ‌టంవ‌ల్ల పార్టీలోను, ప్ర‌జ‌ల్లోను ప‌ల‌చ‌న‌య్యే అవ‌కాశముంద‌ని సంజ‌య్‌ను సొంత‌పార్టీవారే హెచ్చ‌రిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: