దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు వేగంగా పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా క‌ట్ట‌డికి దాదాపు అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అల‌ర్ట‌వుతున్నాయి. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే బుధ‌వారం ఉద‌యం నుంచి గురువారం ఉద‌యం నాటికి 8వేల‌కు పైగా కేసులు న‌మోద‌వ‌డంతో మ‌ళ్లీ జ‌నాలు భ‌యాందోళ‌న చెందుతున్నారు. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, రాజ‌స్థాన్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేస్తోంది. మిగ‌తా రాష్ట్రాల‌కు క‌రోనా ఉధృతి పెర‌గ‌కుండా కంటోన్మెంట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించింది. దీనిని సెకండ్‌వేవ్ అని అన‌లేమ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.


మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా ప్రకటించారు. చాలా రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలతో ప్రయాణికులను అనుమతిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్‌లో నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అధికారులు ఆయా రాష్ట్రాల్లోకి అనుమతిస్తున్నారు. అయితే తాజాగా ఏడు రాష్ట్రాల్లోనే కొత్తగా 90శాతం కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఏడు రాష్ట్రాల్లో మొత్తం 89.57 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర‌లో అత్యధికంగా 8,807 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ త‌ర్వాత స్థానంలో కేర‌ళ ఉంది.ఈ రాష్ట్రంలో  4,106, పంజాబ్ రాష్ట్రంలో 558, తమిళనాడులో 463, గుజరాత్‌లో 380, మధ్యప్రదేశ్‌లో 344, కర్ణాటకలో 334 కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. వీటితో కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 16,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.


ఇదిలా ఉండ‌గా క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న రాష్ట్రాల నుంచి జ‌నాలు త‌మ రాష్ట్రంలోకి వ‌చ్చే జ‌నాల నుంచి క‌రోనా నెగ‌టివ్ స‌ర్టిఫికెట్ ఉంటేనే రానిస్తున్నాయి. ఈ త‌ర‌హా విధానాన్ని ఢిల్లీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలు ఆదేశాలు జారీచేశాయి. కొత్త‌గా రాజ‌స్థాన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.  రాజస్థాన్ ప్రభుత్వం ముందు జాగ్రత్తచర్యగా కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రాజస్థాన్ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే.. తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: