కరెంట్ ఛార్జీలను పెంచాలని తెలంగాణ డిస్కమ్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఛార్జీల టారీఫ్‌ను విద్యుత్‌ నియంత్రణ మండలికి అందజేశాయి. ఈఆర్సీ సైతం విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలను... ప్రభుత్వం ముందు పెట్టినట్లు తెలుస్తోంది. పేద ప్రజలపై భారం పడనివ్వబోమని... గతంలో సీఎం కేసీఆ ర్ ప్రకటించారు. ఛార్జీలు పెరిగితే... మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై భారం పడే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా చార్జీల భారం మోపకుండా... పరోక్షంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుతిచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ ఒకే చెబితే...డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ చేపట్టనుంది. ఆ తర్వాత టారీఫ్‌ను ప్రకటించనున్నారు.

రాష్ట్రంలో 2015లో విద్యుత్ చార్జీలు పెరిగాయి. అప్పట్లో 100 నుంచి 200 యూనిట్ల విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు 4 శాతం, 200 యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగించే వారికి 5.75 శాతం పెంచారు. కమర్షియల్, పారిశ్రామిక కస్టమర్లకు అన్ని రకాల చార్జీలపై 5.75 శాతం దాకా పెరిగింది. దీంతో  825.61 కోట్ల మేర అదనపు ఆదాయం...డిస్కంలకు సమకూరింది. ఇప్పుడు దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ  2వేల కోట్లు... ఎన్పీడీసీఎల్ మరో 600 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు అంచనా. ఈ లోటును పూడ్చుకోవడానికి చార్జీలు పెంచక తప్పదని భావిస్తున్నాయి. డిస్కంల నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

విద్యుత్ ఛార్జీలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.  గ్యాస్, పెట్రోల్, డీజిల్, పాల ధరలు పెరిగి పోవడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే ఇది ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారే అవకాశముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: