ఆదాయం పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం మార్గాలను వెతుకుతొంది. భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచబోతోంది. కరోనా సహా ఇతర కారణాలతో రిజిస్ట్రేషన్ ల శాఖ కోల్పోయిన ఆదాయాన్ని.. రికవరీ చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి భూముల మార్కెట్ విలువల పై ప్రభుత్వం సమీక్ష చేయలేదు... విలువలు పెంచలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 నాటి ప్రభుత్వం ల్యాండ్ మార్కెట్ వాల్యూస్ ని రివైజ్ చేసింది. అప్పటి నుండి అవే మార్కెట్ ధరలు కొనసాగుతున్నాయి. అయితే, భూముల రేట్లు పెంచాలని.. రిజిస్ట్రేషన్ ల శాఖ గతంలోనే ప్రభుత్వానికి సూచించింది. వాస్తవ విలువలతో పోలిస్తే మార్కెట్‌ విలువలు తక్కువగా ఉండటంతో.. రిజిస్ట్రేషన్ల శాఖకు రావాల్సినంత స్టాంపు డ్యూటీ, ఫీజులు రావడం లేదని రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తోన్న ప్రభుత్వం.... తొందరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భూముల వాస్తవ విలువలకు అనుగుణంగా మార్కెట్ విలువను సవరించబోతోందని తెలుస్తోంది.

ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు పథకం వల్ల బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఎకరం ధర ఎక్కడా 10 లక్షలకు తక్కువ లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి కోటి కి పైగా పలుకుతోంది. ప్రభుత్వ రేట్లకి వాస్తవ విలువలకి భారీగా వ్యత్యాసం ఉంది.

రెండున్నర ఏళ్ల క్రితం ఉప్పల్‌ భగాయత్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో గజం ధర 77 వేలు పలికింది. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్‌ విలువ ప్రకారం అక్కడ గజం ధర 7 వేలే. షాద్‌నగర్‌, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, ఘట్కేసర్‌, ఆదిభట్ల వంటి చోట్ల కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లోనూ భూముల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటివరకు మార్కెట్ వాల్యూను పెంచలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: