ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతకు ఊహించని షాక్ ఎదురైంది. అదికూడా ఆయన సొంత నియోజకవర్గం కుప్పం తమ్ముళ్లే చంద్రబాబుకు చుక్కలు చూపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుప్పం టీడీపీలో నిస్తేజం అలుముకుంది. దీంతో కేడర్ లో ఉత్సాహం నింపేందుకు మూడు రోజుల పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. అయితే ఆయనకు కుప్పం టీడీపీ కార్యకర్తలు మరో సమస్యను తెచ్చిపెట్టారు.

 జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలంటూ చంద్రబాబు రోడ్ షో లో నినాదాలు చేశారు కార్యకర్తలు.
 జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలి.. టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలంటూ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు సమక్షంలో బహిరంగంగా డిమాండ్ చేశారు. జై చంద్రబాబు.. జై జూనియర్ ఎన్టీఆర్ నినాదాలతో కుప్పం రోడ్ షో లో హోరెత్తించారు. ఎన్టీఆర్ ఫోటోలను ప్రదర్శిస్తూ కేకలు వేశారు.

  కుప్పం చంద్రబాబు పర్యటనలో జరిగిన ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారగా.. టీడీపీలో కాక రేపుతోంది. తాత పెట్టిన పార్టీ కోసం 2009లో టీడీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు జూనియర్. అచ్చం పెద్ద ఎన్టీఆర్ మాదిరే ఖాకీ డ్రెస్ ధరించి.. చైతన్యరథంపై పర్యటించి అదరగొట్టారు. తెలుగు తమ్ముళ్లలో ఉత్తేజం, ఉత్సాహం నింపారు. అయితే 2009లో వైఎస్సార్ ప్రభంజనానికి ఎదురొడ్డి.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో జూనియర్ విఫలమయ్యాడు.తర్వాత కుటుంబంలో, పార్టీలో జరిగిన పరిణామాలతో జూనియర్..  పసుపు పార్టీకి దూరమయ్యారు. లోకేశ్ ఎంట్రీతో ఎన్టీఆర్ ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాని ఎన్టీఆర్ మాత్రం తటస్థంగానే ఉన్నారు. తాజా పరిణాామాలతో జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రచారం చేయాలని కోరడమంటే.. తమకు నారా లోకేశ్ పై నమ్మకం లేదనే కుప్పం తమ్ముళ్లు చెప్పకనే చెప్పారనే చర్చ జరుగుతోంది. కుప్పం నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గురించి తమ్ముళ్ల అలోచన ఎలా ఉంటుందో  ఊహించవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: