నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. కేరళ, తమిళనాడు, పుదిచ్చేరిలో ఒకే విడతలో ఎన్నిక జరగనుండగా.. అసోంలో మూడు దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కాక రేపుతున్న పశ్చిమ బెంగాల్ లో మాత్రం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఎనిమిది విడతలుగా బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసీ ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసోంలో మూడు విడతలుగా, తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, బెంగాల్‌లో మాత్రం ఎందుకు ఎనిమిది విడతలుగా నిర్వహిస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  తాము ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే.. బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఇన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తోందని మమత ఆరోపించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సలహా మేరకే ఈ నిర్ణయమా? వారి ప్రచారాన్ని సులభతరం చేయడానికేనా? అని దీదీ ప్రశ్నించారు. బెంగాల్ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చే ముందే అసోం, తమిళనాడు ప్రచారాన్ని ముగించుకోవచ్చన్న భావనా? అలా కుదరదు.. ఈ ఐడియా బీజేపీకి కలిసిరాదు. అలా కానివ్వం..  అంటూ మమత బెనర్జీ ఫైర్ అయ్యారు.

 ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపైనా మమత మండిపడ్డారు.  సౌత్ 24 పరగణా జిల్లాలో తాము చాలా బలంగా ఉన్నాం. అక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 లాగా మాకు నేర్పిస్తున్నారు.’’ అని బెంగాల్ సీఎం మండిపడ్డారు. బీజేపీ వారు మతాల ఆధారంగా ప్రజలను విభజిస్తున్నారని, ఇప్పుడే ఆట ప్రారంభమైందని, ఆట ఆడి, ఆటలో గెలిచి చూపిస్తామని మమత ధీమా వ్యక్తం చేశారు.

తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మార్చి 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడతాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది

మరింత సమాచారం తెలుసుకోండి: