కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు, కార్యకర్తల నినాదాలతో ఒక్కసారిగా షాకయ్యారు. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులున్నారు, వారంతా తమ అభిమాన హీరో పేరుతో నినాదాలు చేసి బాబుకి షాకిచ్చారు. ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ను ప్రచారానికి రప్పించండి. ఆయనతో కుప్పంలో ప్రచారం చేయించండి’ అంటూ రామకుప్పం, రాజుపేటల్లో నిర్వహించిన రోడ్‌ షోలో కొందరు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును కోరారు. ఆయితే ఆ మాటల్ని చంద్రబాబు పట్టించుకోనట్టే ఉన్నారు. కాసేపు మౌనం వహించారు. తాను ఇప్పటి నుంచి మూణ్నెల్లకోసారి నియోజకవర్గానికి వస్తానని.. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అవసరమైతే లోకేశ్‌, ఇతర నాయకులు కూడా ఇక్కడికి ప్రచారానికి వస్తారని శ్రేణులకు తెలిపారు.

ఇంతకీ జూనియర్ ప్రస్తావన ఎందుకొచ్చింది..?
2019 సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఎరగని ఘోర పరాభవాన్ని చవిచూసింది టీడీపీ. ఇక పార్టీ పని అయిపోయిందని వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది. అయితే ఇలాంటి ప్రచారాలతో కుదరదని, టీడీపీ పడినా తిరిగి లేస్తుందని, అధికారంలోకి వస్తుందని చంద్రబాబు కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అయినా కాస్త పరువు దక్కుతుందనుకుంటే అది కూడా లేదు. సాక్షాత్తూ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే బాబు పరువుపోయింది. దీంతో హడావిడిగా ఆయన కుప్పంకి పరిగెత్తుకొచ్చి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రావడమే ఇతర నాయకుల్ని ఆలోచనలో పడేస్తోంది. పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామంటూ చంద్రబాబు రోడ్ షో లో చెప్పిన తర్వాతి రోజే కార్యకర్తలు జూనియర్ పేరు తెరపైకి తెచ్చారు. దీంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ పేరుని తెరపైకి తెచ్చారా లేక, కార్యకర్తలే అత్యుత్సాహంతో జూనియర్ పేరుతో నినాదాలు చేశారా అనేది తేలాల్సి ఉంది.

వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాలపై పెద్ద ఆసక్తి లేదనే విషయం గతంలోనే తేలిపోయింది. సొంత సోదరి కూకట్ పల్లి అసెంబ్లీ పోరులో నిలబడ్డా కూడా జూనియర్ ప్రచారానికి వెళ్లలేదు, కనీసం తమ తరపున ఓ స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. 2009 ఎన్నికల ప్రచారం తర్వాత పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారు ఎన్టీఆర్, చంద్రబాబు కూడా ఆయన్ని దూరంగానే పెట్టి కొడుకు లోకేష్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ దశలో జూనియర్ పేరు మరోసారి తెరపైకి రావడంతో తెరవెనక ఏదో వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిజంగానే పార్టీకి కొత్తరక్తం ఎక్కించడంలో భాగంగా జూనియర్ పేరుని చంద్రబాబే పలికించారా అనేది వైరిపక్షాల అనుమానం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: