వాలంటీర్లకు సేవా పురస్కారాలు ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్.. వారికిప్పుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. సేవా రత్న, సేవా మిత్ర అంటూ బిరుదులిస్తారనుకున్నారు కానీ, ఏకంగా 20వేలు, 30వేలు నగదు పురస్కారం ఇస్తారని ప్రకటించేసరికి వాలంటీర్లు కూడా సంబరపడుతున్నారు. ఉగాదినుంచి ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుంది. స్వయంగా సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా తెలుస్తోంది.

సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రం.. మూడు కేటగిరీలు..
కేటగిరి-1 సేవామిత్ర: ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వాలంటీర్ల పేర్లు పరిశీలిస్తారు. ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్, రూ.10 వేల నగదు బహుమతి అందిస్తారు.
కేటగిరి-2 సేవారత్న: ప్రతి మండలం, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లను సేవా రత్న కేటగిరీకింద ఎంపిక చేస్తారు. వీరికి సేవా రత్న పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి అందిస్తారు.  
కేటగిరి-3 సేవావజ్రం: ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లను ఎంపిక చేస్తారు. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్‌తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారం. నియోజకవర్గం మొత్తంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్రం అనే పురస్కారం ఇస్తారు.

సచ్ఛీలత, మూడు రోజుల్లోగా పింఛన్ల పంపిణీ, హాజరు, యాప్‌ ల వినియోగంలో చురుకుదనం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్‌ –19 సర్వే తదితర అంశాలను ఈ పురస్కారాల ఎంపికలో ప్రామాణికంగా తీసుకుంటారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాలకు హాజరవుతానని సీఎం జగన్ ప్రకటించారు. పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారాయన. వాలంటీర్ల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తామని, పురస్కారాలు వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని అంటున్నారు జగన్.  ఈ ఏడాది ఉగాదితో మొదలయ్యే ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెబుతున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: