మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే అన్ని చోట్లా అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే నిజంగానే టీడీపీ గెలిస్తే అన్న క్యాంటీన్లను తెరిచే అవకాశం ఉందా? అసలది సాధ్యమయ్యే పనేనా అనేది అనుమానమే. క్యాంటీన్లతోపాటు, ఆటో స్టాండ్ లు, ఎపెన్ జిమ్ లు, వార్డు పార్కులు.. ఇలా చాలానే హామీలిచ్చారు టీడీపీ నేతలు. వీటి సాధ్యాసాధ్యాలపైనే ఇప్పుడు చర్చంతా.

అన్న క్యాంటీన్లను ఆల్రడీ వార్డు సచివాలయాలుగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. మిగిలినవాటిని ఆప్కో విక్రయశాలలకు కేటాయిస్తానంటోంది. ఈ దశలో టీడీపీ మున్సిపాల్టీల్లో పాగా వేస్తే క్యాంటీన్లను తిరిగి తెరుస్తామంటోంది. అయితే ఇది సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతిని ఘనంగా ప్రకటించిన చంద్రబాబు.. వాటి అమలుని మాత్రం మూడేళ్లు పట్టించుకోలేదు. ఎన్నికల ఏడాదిలో పనులు పూర్తి చేసి క్యాంటీన్లు తెరిచాం, నిరుద్యోగ భృతి ఇచ్చామని చెప్పుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడే హామీలు అమలు చేయలేని చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేకుండా కేవలం మున్సిపాల్టీల్లో అధికారంలోకి వచ్చి పనులెలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఇతర పార్టీల నేతలు. టీడీపీ మున్సిపాల్టీ మేనిఫెస్టోని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మేనిఫెస్టోలో ఏకంగా 10వాగ్దానాలిచ్చింది టీడీపీ. ఆయా మున్సిపాల్టీల్లో ఆటోడ్రైవర్లకు టాయిలెట్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మూతపడిన అన్న క్యాంటీన్లు తెరిపించి రూ.5కే పేదలకు భోజనం పెడతామన్నారు. పాత పన్నులు పూర్తిగా మాఫీ చేస్తామని, ప్రస్తుత స్లాబులో 50 శాతం పన్ను మాత్రమే విధిస్తామన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తామని, ఆరు నెలలకోసారి జాబ్‌మేళా నిర్వహిస్తామని చెప్పారు. గుంతలులేని రోడ్లు వేయిస్తామ ని, వార్డుల్లో పార్కులు, ఓపెన్‌ జిమ్ ‌లు, ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంచుతామని, ఉచిత మంచినీటి కనెక్షన్‌ ఇచ్చి నీటిపన్ను రద్దు చేస్తామని తెలి పారు. ఈ హామీలన్నీ అమలుచేయడం టీడీపీ వల్ల కాదని, అమలు సాధ్యంకాని వాగ్దానాలతో ప్రజల్ని టీడీపీ మభ్యపెడుతోందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: