గాడిద పాల‌కే కాదు మాంసానికి డిమాండ్ ఏర్ప‌డుతోంది. అందునా తెలుగు రాష్ట్రాల్లోనూ గాడిద మాంసం తినాల‌నే వారి సంఖ్య బాగా పెరిగిన‌ట్లుగా దానికి ఏర్ప‌డుతున్న డిమాండ్‌ను బ‌ట్టి తెలుసుకోవ‌చ్చు. ఇటీవ‌ల గాడిద‌ల అక్ర‌మ ర‌వాణాను పోలీసులు చేధిస్తున్నారు. అయినా అక్ర‌మ ర‌వాణా ఆగ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గాడిద‌ల‌ను వ‌ధించ‌డానికి, వాటి మాంసం విక్ర‌యించ‌డానికి ఎలాంటి అనుమ‌తులు ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదు. అయినా పెద్ద ఎత్తున గాడిద‌ల‌ను వ‌ధించి వాటి మాంసాన్ని అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్న‌ట్లుగా పోలీసులు గుర్తించారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గాడిద మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్లుగా పోలీసుల త‌నిఖీల్లో వెల్ల‌డైంది.


ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా గాడిదలను తీసుకొచ్చి మాంసాన్ని విక్రయిస్తున్నారు. గతంలోనే ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న 8 గాడిదలను ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి.గాడిద మాంసం తినడం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుంద‌న్న అపోహాలు బాగా వ్యాప్తి చెంద‌డ‌మే ఈ జంతువు మాంసానికి డిమాండ్ ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. కొంత‌మంది చేస్తున్న దుష్ర్ప‌చారంతో వాటిప్రాణం మీద‌కు వ‌చ్చింది. గాడిద మాంసం తింటే బలవంతులుగా తయారవుతారని కూడా నమ్ముతున్నారట. దీంతో పెద్ద ఎత్తున గాడిద మాంసం విక్రయాలు జరుగుతున్నాయి.  గ‌తంలో పెద్ద‌గా డిమాండ్‌లేని ఈ జంతువుల‌కు ఇప్పుడు ఏకంగా రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పలుకుతుండ‌టం విశేషం.


దీన్ని బట్టి గాడిద మాంసాన్ని ఏ రేంజ్‌లో తినేస్తున్నారో అర్థమవుతోంది. తాజా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గాడిదల సంఖ్య కేవలం 5 వేలకు పడిపోయింది. అలాగే 2012 నుంచి దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్య 60 శాతం మేర పడిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గాడిద అంటే ఫొటోల్లో చూసే పరిస్థితి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంతు వధ చట్టం 2001 ప్రకారం.. గాడిదను చంపి మాంసంగా విక్రయించడం చట్టరీత్యా నేరం. గాడిదను చంపితే జంతు హింస చట్టం కింద, ఐపీసీ 428, 429 సెక్షన్ల ప్రకారం కఠిన శిక్షలు కూడా అమలు చేస్తామ‌ని పోలీసులు వెల్ల‌డిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: