విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే చిన్న పిల్లలుగా మారారు. సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పే వాళ్లే గొడవలకు దిగారు. నీతి వ్యాక్యాలు, సమాజంపై విద్యార్థులకు అవగాహన పెంచే వాళ్లే మరీ దిగజారి గొడవపడ్డారు. మంచి మాటలు నేర్పే వారే పిల్లల ముందు బూతులు మాట్లాడసాగారు. అది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వీరి మధ్య గొడవలు కేవలం మనస్పర్థలేనా..? లేదా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా..? అది తెలియాలంటే అసలు విషయం తెలవాల్సిందే.

ఇద్దరు లెక్చరర్లు వీధి రౌడీల్లా తరగతి గదిలో కొట్టుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. రెచ్చిపోయిన ఇద్దరు క్లాస్‌రూమ్‌లోనే ఒకరినొకరు బీభత్సంగా కొట్టుకున్నారు. హటాత్తుగా గొడవ ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గొడవ పడుతున్నంత సేపు గుమిగూడి.. పొట్లాటను వీక్షించారు. కాలేజీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అవడంతో సమస్య కాస్త సర్దుమణిగింది.

పూర్తి వివరాలోకి వెళితే.. అనపర్తి శివారు కొత్తూరులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఇంగ్లీష్ మీడియం గురుకుల జూనియర్‌ కాలేజీ ఉంది. అందులో వెంకటేశ్వరరావు ఎనిమిదేళ్లగా పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం కిందట వెంకటేశ్వరరావుతో పాటు కొంత మంది పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు టెట్‌ పరీక్షలకు హాజరుకాలేదని ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావు కొద్ది రోజుల పాటు విధుల నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత మళ్లీ విధుల్లోకి హాజరయ్యారు. వెంకటేశ్వరరావుతో పాటు మరో లెక్చరర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంపై వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు మధ్య మనస్పర్థలు పెరిగాయి. కాలేజీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆ రోజు నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం మొదలు పెట్టాడు. దీనిపై శ్రీనివాసరావును వివరణ కూడా కోరారు. ఈ క్రమంలో గురువారం ఇద్దరు క్లాస్‌రూమ్‌లోనే గొడవకు దిగారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు, తోటి అధ్యాపకులు అడ్డుపడి అనపర్తిలో ఆస్పత్రికి తరలించారు. అధికారులు ఈ గొడవకు సంబంధించి విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లాస్‌రూమ్‌లోనే గొడవ పడటంపై ఉన్నతాధికారులు ఎలాంటి వేటు వేస్తారనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: