తూర్పు గోదావరి జిల్లాలో విస్తరించిన పట్టణం తుని. 1959లో పురపాలక సంఘంగా ఆవిర్భవించింది.  1952లో తొలిసారి శాసన సభ ఎన్నికలు జరగ్గా... ఎమ్మెల్యే రాజా బుల్లిబాబు పట్టణాభివృద్ధికి కృషి చేసి.. మున్సిపాలిటీ స్థాయికి తెచ్చారు. 1963లో తొలిసారి పురపాలక ఎన్నికలు జరగ్గా... మొదటి చైర్మన్ గా ఎస్.ఆర్.వి.వి జగపతి బహదూర్ బాధ్యతలు స్వీకరించి... రెండు దఫాలు ఆయనే పనిచేశారు. అనంతరం ఏడుగురు చైర్మన్ లుగా పాలన సాగించగా.. తాజాగా జరిగే ఎన్నికలతో తొమ్మిదవ చైర్మన్ ఎన్నిక కానున్నారు.

ఈ ద‌ఫా తునిని జనరల్ మహిళకు కేటాయించగా.. వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 30 వార్డులు ఉండగా... ఇప్పటికే తొమ్మిది వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక‌, స‌మ‌స్య‌ల‌ను తీసుకుంటే.. ప్రధానంగా తుని మున్సిపాలిటీల్లో ప్రధాన సమస్య.. తాండవ నదికి వచ్చే వరద. ఏళ్ల తరబడి ఈ నదికి వరద రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరువైపులా రిటైనింగ్ నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే... డ్రైనేజీ, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్ ల సమస్య కూడా పరిష్కరించాలని ఎప్ప‌టి నుంచో డిమాండ్ ఉంది.

రాజకీయంగా 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా టీడీపీ ఇక్క‌డ చ‌క్రం తిప్పింది. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ త‌ర్వాత వైసీపీ పుంజుకుంది. ఎవ‌రు వ‌చ్చినా.. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేద‌నే వాద‌న ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితిని మారుస్తామ‌ని.. త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ రెండు పార్టీలూ ప్ర‌ధానంగా ప్ర‌చారం చేస్తున్నాయి.

మ‌రోవైపు కాపు సామాజిక వ‌ర్గం ఎటు ఉంటుంద‌నేది ఇక్క‌డ ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇటీవ‌ల ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన పుంజుకుంది. మ‌రి ఈ ప్ర‌భావం ఉంటుందా?  లేక‌.. అధికార పార్టీకి ప్ర‌జ‌లు జై కొడ‌తారా?  లేక‌.. ప్ర‌తిప‌క్షాన్ని పుంజుకునేలా చేస్తారా? అనేది చూడాలి. ఏదేమైనా య‌న‌మ‌ల ఫ్యామిలీ ఇప్ప‌టికే ఇక్క‌డ మూడు సార్లు ఓడిపోవ‌డంతో ఆయ‌న అనేక క‌ష్టాల మ‌ధ్య ఈ ఎన్నిక‌లు ఫేస్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: