రాష్ట్ర బీజేపీ ఖాతా నుంచి జిల్లాలు జారి పోతున్నాయి. ఒక‌వైపు పుంజుకునేందుకు పార్టీ నాయ‌కులు ప్ర‌య త్నిస్తుంటే.. మ‌రోవైపు కేంద్రంలోని బీజేపీ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో రాష్ట్రంలో ప్రాంతాలు కాదు.. ఏకంగా జిల్లాలే బీజేపీకి దూర‌మ‌వుతున్నాయి. అత్యంత ప‌ట్టుంద‌ని భావించిన విశాఖ‌, అంతో ఇంతో ఎదుగుతున్నా మ‌ని అనుకున్న కృష్ణా, ఖ‌చ్చితంగా త‌మ‌కు ఎడ్జ్ ఉంటుంద‌ని అనుకున్న తూర్పు గోదావ‌రి, గుంటూరు, క‌ర్నూలు జిల్లాలు స‌హా మ‌రో రెండు జిల్లాలు ఇప్పుడు బీజేపీ ఖాతా నుంచి పూర్తిగా జారిపోతున్నాయి.

విశాఖ‌లో ఒక‌ప్పుడు ప‌ట్టుకొమ్మ‌గా భావించేవారు. ఇక్క‌డ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను చ‌క్రాలు తిప్పారు. గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా.. పార్టీకి అంతో ఇంతో ఎడ్జ్ ఉంద‌ని.. కొంచెం క‌ష్ట‌ప‌డితే.. చాల‌ని అనుకున్నారు. అయితే.. తాజాగా విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీ క‌రించ‌డం త‌ధ్య‌మ‌ని అనుకున్న నేప‌థ్యంలో బీజేపీ ఖాతా నుంచి ఈ జిల్లా పూర్తిగా జారిపోయింది. కృష్ణా జిల్లాను తీసుకుంటే.. కీల‌క నాయ‌కులు సైలెంట్ కావ‌డంతోపాటు.. రాజ‌ధాని ఎఫెక్ట్ బీజేపీపై ప‌డింది. దీనికితోడు.. వైసీపీ, టీడీపీలు పుంజుకోవ‌డం కూడా బీజేపీకి ఇబ్బందిగా మారింది.

ఇక‌, గుంటూరులో రాజ‌ధాని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. వాస్త‌వానికి ఈవిష‌యం తెలిసే.. గ‌త అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. అయితే.. సోము మాత్రం కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో ఇక్క‌డ కూడా బీజేపీని ఆద‌రించే నాయ‌కులు, ప్ర‌జ‌లు కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, క‌ర్నూలుకు హైకోర్టు ఇస్తామ‌ని.. బీజేపీ రాష్ట్ర నాయ‌కులు త‌మ మేనిఫెస్టోలో పెట్టారు. అనేక వేదిక‌ల‌పైనా వెల్ల‌డించారు. అయితే.. తాజాగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఇది త‌మ చేతుల్లో లేద‌ని.. ఖ‌ర్చులు కూడా ఇవ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఇక్క‌డి ప్ర‌జులు కూడా ఆగ్ర‌హంతో ఉన్నారు.

తూర్పుగోదావ‌రిలో సోము వీర్రాజు ప్ర‌భావం క‌నిపించ‌డంలేదు. పైగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్‌కు సంబంధించి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రంలోనిబీజేపీ పెద్ద‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో బీజేపీ వ‌ల్ల త‌మ కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని భావిస్తున్నారు. ఇలా.. మొత్తంగా ప్రాంతాలు దాటి.. ఇప్పుడు బీజేపీ వ్య‌తిరేక‌త జిల్లాల‌కు విస్త‌రించింది. దీంతో బీజేపీ పుట్టిమున‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: