చిత్తూరు జిల్లా కుప్పం(చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం)లో వైసీపీనే అన్ని పంచాయతీల‌ను కైవ‌సం చేసుకుంద‌ని వైసీపీ ఆనందంగా ప్ర‌క‌టించుకున్నా.. చిత్తూరు మునిసిపాలిటీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం ప‌రిస్థితి భిన్నంగా మారిపోయింది. ఇక్క‌డ వైసీపీకి అనేక త‌ల‌నొప్పులు త‌యార‌య్యాయి. గతేడాది మార్చిలో అర్ధాంతరంగా ఆగిన మున్సిపల్‌ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఇటీవల షెడ్యూలు ప్రకటించినప్పటికీ ఇంకా వైసీపీ అభ్యర్థుల ప్రచారాలు, ఎన్నికల హడావిడి మొదలు కాలేదు. అంతర్గత సర్దుబాట్లు, రెబెల్స్‌ను తప్పించడం, ఏకగ్రీవాలపై అధికార పార్టీ వర్గాలు దృష్టి సారించాయి.

చిత్తూరు నగరంలో 50 డివిజన్లుండగా 49 డివిజన్లలో పోటీ నెలకొంది. వైసీపీకి సంబంధించి ప్రతి వార్డులోనూ ఆరుగురికి తక్కువ కాకుండా రెబెల్స్‌ రంగంలో ఉండ‌డం ఇప్పుడు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. రెబెల్స్‌ ఎవరూ పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యే శ్రీనివాసులు, బుల్లెట్‌ సురేష్‌, విజయానందరెడ్డి, చుడా ఛైర్మన్‌ పురుషోత్తంరెడ్డిలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పగించారు. వీరిలో ఎమ్మెల్యే మినహా ముగ్గురికీ తలా పది డివిజన్లు అప్పగించారు.

దీంతో వీరు ఆయా డివిజన్లకు సంబంధించిన రెబెల్స్‌ను పిలిపించి మంతనాలు జరుపుతున్నారు. రెబెల్స్‌ తలా వంద మందికి తక్కువ కాకుండా జనాన్ని వెంటేసుకొచ్చి బలప్రదర్శనకు దిగుతున్నారు. దీంతో వైసీపీ నేత‌లను బుజ్జ‌గించ‌డం పార్టీ కీల‌క నేత‌ల‌కు సాధ్యం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుతుందో చూద్దామ‌నే ధోర‌ణిలో నాయ‌కులు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక టీడీపీ విషయానికొస్తే  ఎమ్మెల్సీ దొరబాబు, ముఖ్య నేతలు కటారి ప్రవీణ్‌, కాజూరు బాలాజీ తమ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకుండా చూసే యత్నాల్లో బిజీగా వున్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీకేబాబు పార్టీపై అలిగి.. మునిసిపాలిటీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. నగరంలో ఆయనకు చెప్పుకోదగిన పరిచయాలు, అనుచరవర్గం, పట్టు ఉన్న‌ప్ప‌టికీ సీకే సేవలను పార్టీ వినియోగించుకుంటే మంచిదన్న అభిప్రాయం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఇలా.. చిత్తూరు మునిసిపాలిటీలో అధికార పార్టీలో దూకుడు ఎక్కువ‌గా ఉంటే.. టీడీపీలో నిస్తేజం ఆవ‌రించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: